మీకెందుకురా అంత కసి : మన ఓటమిని పండగ చేసుకున్న బంగ్లాదేశ్ కుర్రోళ్లు

మీకెందుకురా అంత కసి : మన ఓటమిని పండగ చేసుకున్న బంగ్లాదేశ్ కుర్రోళ్లు

క్రికెట్ లో ఏ జట్టుతోనూ బంగ్లాదేశ్ జట్టుకు అంత మంచి సంబంధాలు ఉండవు. ఒక్క మ్యాచ్ గెలిస్తే వీరి ఓవరాక్షన్ భరించలేం. ముఖ్యంగా ఆసియా దేశాలైన భారత్, శ్రీలంక, పాకిస్థాన్ జట్లపై విమర్శలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తారు.ఒక్క క్రికెట్ టీం మాత్రమే కాదు ఆ దేశ అభిమానుల అతి అంతకు మించి అనేలా ఉంటుంది. బంగ్లాదేశ్ గెలిస్తే నాగిని డ్యాన్స్ చేయడం, పిచ్చి పిచ్చి వేషాలు వేయడం వీరికే చెల్లుతుంది. తాజాగా టీమిండియా ఓడిపోతే సెలెబ్రేట్ చేసుకుంటూ పైశాచిక ఆనందం పొందారు. 
 
ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ను పెద్ద స్క్రీన్స్ లో బంగ్లా క్రికెట్ ప్రేమికులు చూడడం విశేషం. 43 ఓవర్ చివరి బంతికి సిరాజ్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ విన్నింగ్ రన్స్ కొట్టడంతో పెద్దగా గోల చేస్తూ వీరి సంబరాలు మొదలయ్యాయి. కొంతమందైతే భారత జట్టు ఓటమిపై బహిరంగంగా మాట్లాడుకోవడం గమనార్హం. భారత జట్టు ఓటమిని ఎంజాయ్ చేయడంతో ఆ దేశ క్రికెట్ అభిమానుల మీద సర్వత్రా విమర్శల వర్షం కురుస్తుంది. ఇలా బహిరంగంగానే ఒక జట్టు ఓటమి కోరుకోవడంతో ఆ దేశ క్రికెట్ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉంది. 

ఈ వరల్డ్ కప్ లో షకీబ్ సారధ్యంలోని బంగ్లా జట్టు చెత్త ఆట తీరుతో గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టింది. ఈ మెగా టోర్నీలో మొత్తం 9 మ్యాచ్ లాడిన బంగ్లాదేశ్.. 2 మాత్రమే గెలిచి 7 ఓడింది. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక లాంటి బలహీన జట్లపై ఈ విజయాలు వచ్చాయి. ఈ వరల్డ్ కప్ కు ముందు గట్టి పోటీ ఇస్తుందనుకున్న బంగ్లాదేశ్ పేలవ ఆట తీరుతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. మరోవైపు భారత్ ఆడిన 9 మ్యాచ్ ల్లో విజయం సాధించి టేబుల్ టాపర్ గా నిలిచింది.