బంగ్లాదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఎంపీగా ఘనవిజయం సాధించారు. మగురా పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన ఏకంగా లక్ష యాభై వేల మోజార్టీతో విజయం సాధించారు.
36 ఏళ్ల షకీబ్.. అవామీ లీగ్ పార్టీ తరుపున ఎన్నికల బరిలో దిగారు. కొద్ది రోజులే ప్రచారం చేసినా భారీ మోజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచారం కోసం క్రికెట్‌కు కొద్ది రోజులు షకీబ్ దూరంగా ఉన్నాడు. షకీబ్ చివరిసారిగా వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడాడు.
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీకి మెజారిటీ లభించింది. 300 స్థానాలకు గానూ ఆ పార్టీ ఏకంగా 200 సీట్లను గెలుచుకుంది. దీంతో షేక్ హసీనా ఐదోసారి ప్రధాని పీఠం అధిరోహించనున్నారు.
గోపాల్‌గంజ్-3 నుంచి బరిలోకి దిగిన షేక్ హసీనా .. 2,49,965 ఓట్లు వచ్చాయి. ఆమె సమీప ప్రత్యర్థి బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన నిజాముద్దీన్ లష్కర్‌కు కేవలం 469 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1986 నుంచి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నషేక్ హసీనా వరుసగా ఎనిమిదో సారి గెలిచారు. ఇక ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీ సహా దాని మిత్రపక్షాలు బహిష్కరించాయి.