బంగ్లాదేశ్​లో పెను సంక్షోభం..మైనారిటీల్లో ఆందోళన

బంగ్లాదేశ్ ప్రస్తుతం అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.  విద్యార్థుల తిరుగుబాటు తర్వాత మత ఛాందసవాదుల రాజకీయ ఆధిపత్యం కారణంగా అరాచక వాతావరణం ఏర్పడింది. బంగ్లాదేశ్‌‌‌‌లో  గత ఆరు నెలలుగా హిందూ మైనార్టీలపై  జరుగుతున్న దాడుల పట్ల  ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ దాడుల వెనుక రాజకీయ, మత, సామాజిక కారణాలు కనిపిస్తున్నాయి. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30శాతం రిజ్వేషన్లను కల్పించడాన్ని నిరసిస్తూ జులైలో సాగిన ఈ విద్యార్థి ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. దీంతో  ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఆమె పార్టీ  అవామీ లీగ్​కు చెందిన నాయకులు, కార్యకర్తల మీద  దాడులు జరిగాయి.  వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.  అవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆమె ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మైనార్టీ హిందువులపై  దాడులు మరింతగా పెరిగాయి.ఈ దాడుల్లో ప్రధానంగా హిందూ నివాసాలు, దేవాలయాలు, వ్యాపారాలు లక్ష్యంగా దాడులు జరిగినట్టు రిపోర్టులు చెబుతున్నాయి.

షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ అధికారం కోల్పోవడం ఆ తర్వాత మిలటరీ సహకారంతో మహ్మద్ యూనాస్ నాయకత్వంలో మధ్యంతర ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో  మైనార్టీలైన హిందువులపై దాడులు అధికంగా నమోదు కావడం, మతపరమైన హింస పెరుగుదల పాలక వర్గాల వైఫల్యాన్ని సూచిస్తోంది.  బంగ్లాదేశ్ లోని  రాడికల్ సంస్థలైన జమాతే ఈ -ఇస్లామీ, హిజ్బుల్ తాహిర్ లాంటి సంస్థలు ఈ హింసను ప్రేరేపించినట్టు వార్తలు వస్తున్నాయి.  ప్రత్యేకంగా దుర్గాపూజ వంటి  హిందూ ఉత్సవాల సమయంలో దాడులు జరగడం,  మైనార్టీ హిందూ మహిళలపై అత్యాచారాలు, బలవంతపు మత మార్పిడులకు పాల్పడడంతో...ప్రస్తుతం పాలిస్తున్న యూనస్ నేతృత్వంలోని  మధ్యంతర  ప్రభుత్వం మైనార్టీల రక్షణలో విఫలమైందని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. 

బంగ్లాదేశ్​ మైనారిటీల్లో ఆందోళన

హిందూ మైనార్టీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌‌‌‌లో మైనార్టీ హిందువులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. తమ రక్షణకు తక్షణం చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.  ఇస్కాన్ సంస్థ ప్రతినిధి చిన్మయి కృష్ణ దాస్ బంగ్లాదేశ్‌‌‌‌లో హిందూ మైనారిటీల హక్కుల కోసం పోరా డుతున్నారు.  2024 అక్టోబర్ 25నాడు చిట్టగాంగ్ న్యూ మార్కెట్ వద్ద జరిగిన నిరసనలో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. దీనికి కారణం, ఆందోళన సమయంలో కాషాయ  జెండాను బంగ్లాదేశ్ జాతీయ పతాకంపైన ఉంచినట్లు ఆరోపించి ఆయన మీద దేశ ద్రోహం కేసుతో పాటు మరో 19 మందిపై కేసు నమోదు చేశారు. చిన్మయి దాస్, ఇతర హిందూ మైనారిటీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మైనార్టీలకు రక్షణ కల్పించాలని కోరుతూ అక్టోబర్​లో చేసిన శాంతియుత ర్యాలీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే, ఆయనను  ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేయడం,  బెయిల్ నిరాకరించడంతో  బంగ్లాదేశ్​లో  మైనార్టీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మైనారిటీల హక్కులు, ప్రాణాలు రక్షించాలి

ఈ నేపథ్యంలో చిన్మయి క్రిష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.  ఇస్కాన్ ఇంటర్నేషనల్ సంస్థతో పాటు శ్రీ శ్రీ రవిశంకర్ తదితర అనేక మంది ప్రముఖులు, హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.  ఢిల్లీలోని బంగ్లా దౌత్య కార్యాలయం ముందు కూడా హిందూ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.  ఈ వ్యవహారంలో తక్షణమే భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయన విడుదలకు కృషి చేయాలని ఇస్కాన్ సంస్థ కోరుతోంది.  గడిచిన గత ఆరు నెలల్లో  బంగ్లాదేశ్​లోని  52 జిల్లాలో 200కు  పైగా దాడులు జరిగాయి. ఈ హింసలో చాలా మంది హిందూ మైనార్టీలు చనిపోయారు.  ఇకనైనా,  మైనార్టీల ఆస్తులను, హక్కులను, ప్రాణాలను కాపాడాలనీ  బంగ్లాదేశ్ హిందూ, బుద్ధిస్ట్,  క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ సంఘం  మహ్మద్ యునాస్  ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసింది.

యూఎన్ఓ, భారత్​ తక్షణం స్పందించాలి

బంగ్లాదేశ్‌‌‌‌లో వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్ (గతంలో పాకిస్తాన్ పాలనలో శత్రువుల ఆస్తి చట్టం)  ప్రకారం 1965, 2006 మధ్య హిందువులకు చెందిన సుమారు 26 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.  దీంతో 12 లక్షల హిందూ కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అలాగే, 2016 జనవరి-– జూన్ మధ్య బంగ్లాదేశ్‌‌‌‌లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న హింసలో 66 ఇండ్లు దగ్ధం అయ్యాయి.  49 దేవాలయాలు ధ్వంసమయ్యాయి. 1951 అధికారిక జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) మొత్తం జనాభాలో  హిందువులు 22 శాతం ఉన్నారు.  2022లో అది 8 శాతానికి తగ్గిపోయింది. అదేకాలంలో ముస్లింల జనాభా 1951లో 76 శాతం ఉండగా 2022 నాటికి 91 శాతానికి పెరిగింది.  హిందూ అమెరికన్ ఫౌండేషన్ నివేదిక  ప్రకారం.. 1964 నుంచి 2013 మధ్య మతపరమైన హింస కారణంగా 11 మిలి యన్లకు పైగా హిందువులు బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు. బంగ్లాదేశ్‌‌‌‌లో ప్రతి సంవ త్సరం 2.3 లక్షల మంది హిందువులు దేశం విడిచి వెళు తున్నారు. 2000 నుంచి 2010 మధ్య దేశ జనాభా నుంచి ఒక మిలియన్ హిందువులు అదృశ్యమయ్యారని 2011 జనాభా లెక్కలు ద్వారా తేలింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి మైనార్టీల విషయంలో జోక్యం చేసుకోవాలి.  హిందూ మైనార్టీలకు రక్షణ కల్పించాలి.  వారి ఆస్తులను. హక్కులను,ప్రాణాలను కాపాడాలి. భారత్​ కూడా బంగ్లాదేశ్​లో  మైనారిటీల రక్షణ కోసం యుద్ధప్రాతి పదికన చర్యలు తీసుకోవాలి.

- భరత్ చౌహాన్