బంగ్లా సంక్షోభం నేపథ్యంలో.. ప్రెజర్ కుక్కర్లో ప్రజాస్వామ్యం

బంగ్లా సంక్షోభం నేపథ్యంలో.. ప్రెజర్ కుక్కర్లో ప్రజాస్వామ్యం

గాలి అంతగా బరువెక్కొద్దు. వాతావరణం నిమ్మళంగా ఉండాలి. నియంతృత్వ వైఖరితో దేన్నీ తెగేదాకా లాగొద్దు.  గదిలో నిర్బంధించికొడితే పిల్లి కూడా తిరగబడుతుందని సామెత.  ప్రజల సహనాన్నిపరీక్షిస్తే జనాగ్రహం హద్దులు చెరిగి హింస పరాకాష్టకుచేరుతుంది. ప్రజాస్వామ్యంలోనూ ఇదే జరిగేది.  ప్రజల కోపంకట్టలు  తెంచుకున్నప్పుడు.. పాలకులకు పారిపోవాల్సినపలాయన మంత్రం’ తప్ప మరోమార్గం కనబడదు. నిన్నటి శ్రీలంక కథైనా, ఇయ్యాల బంగ్లా బతుకైనా,  రేపటి మరో దేశం పరిస్థితైనా.. ఒకటే! ఇరుగుపొరుగు  దేశాల్లో అవలక్షణాలు చూస్తున్నప్పుడు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని జబ్బలు చరుచుకునే భారత్​లోనూ ఇటీవల పొడచూపుతున్న విపరీత వైఖరులు, నియంతృత్వ పోకడలు గుర్తుకు రాకమానవు!  పాలకులు వైఖరి మార్చుకోవాల్సిన, రాజకీయపక్షాలు ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయం ఇది!

ఒకటిన్నర దశాబ్దాలు అప్రతిహత నాయకురాలిగా ఉన్న ఆ దేశ ప్రధాని షేక్ హసీనా, నిమిషాల గడువుతో దేశం నుంచి పారిపోయొచ్చి భారత్​లో తలదాచుకున్న పరిస్థితి. బంగ్లాలో తలెత్తిన విద్యార్థి, యువత నిరసనోద్యమం  తీవ్రరూపందాల్చి ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.దేశాధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ అక్కడి ప్రభుత్వాన్ని, అనంతరం పార్లమెంట్​ను రద్దు చేశారు. నిరసనోద్యమానికి నేతృత్వం వహిస్తున్న విద్యార్థి, యువనాయకులతో  దేశాధ్యక్షుడు,  త్రివిధ రక్షణ దళ నేతలు జరిపిన సంప్రదింపుల అనంతరం.. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పరిచారు. ఉద్యమకారులు కోరినట్టుగానే హసీనా రాజీనామా చేసినా, దేశం వీడి వెళ్లినా, దేశంలో అల్లర్లు, దహనకాండ, దోపిడీలు, లూటీలు, హింస ఆగడం లేదు. నెలరోజుల్లో మృతుల సంఖ్య 560కి చేరినట్టు మీడియా కథనాలు తెలుపుతున్నాయి. నిరసనకారుల ముసుగులో అసాంఘిక శక్తులు, మతఛాందసవాదుల ఆగడాలకు తలపడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. 

చుట్టుపక్కలా అభద్రత

ఇరుగుపొరుగు దేశాల్లోని పరిణామాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని పరిహసించి సుదీర్ఘకాలంగా సాగుతున్నది సైనిక పెత్తనమే! ప్రజాస్వామ్య పోరాట యోధురాలు ఆంగ్​సాన్​ సూకీని నిర్బంధించి, పాలనపై సైన్యం పట్టు బిగించింది.  పాకిస్తాన్​లో సైనిక పెత్తనం,  ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఇమ్రాన్​ఖాన్ ప్రభుత్వానికి అడ్డుపడింది.  పదవీచ్యుతుడిని చేయడమేకాక పలు కేసులు పెట్టి జైలుపాలు చేసింది. ఉన్నంతలో  కొంత ప్రశాంతంగానే ఉండే నేపాల్ ఇటీవల రాజకీయ అనిశ్చితికి గురవుతోంది. విశ్వాసపరీక్షలో ఓడిన ప్రచండస్థానే కేపీ శర్మ ఓలీ ప్రధాని అయ్యారు. ఇక శ్రీలంకలో.. ఆర్థిక సంక్షోభం దరిమిలా ఉత్పన్నమైన నిరసనోద్యమంలో.. రెండేండ్ల కింద, అధ్యక్షుడు రాజపక్షె నివాసంపై దాడిచేసి ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు.  ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ఆయన దేశం విడిచి పారిపోయారు. బంగ్లాలో తాజా సంక్షోభం అనూహ్య పరిణామమే! బయటకు, స్వాతంత్య్ర  సమరయోధుల పిల్లల రిజర్వేషన్ కోటా వివాదాంశంగా కనిపిస్తున్నా..  ఇంతటి మహోజ్వలమైన ఉద్యమం మూలాలు అధికార వ్యవస్థ అవినీతి, నిరుద్యోగం,  ద్రవ్యోల్బణంం,-పెరిగిన ధరలు, పాలన నియంతృత్వ పోకడల్లో దాగున్నాయి . నాలుగయిదు వారాల్లో,  వేగంగా చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం.  వీటి వెనుక పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), దక్షిణాసియాపై పట్టుకోసం కుయుక్తులు చేసే డ్రాగన్ నేషన్ చైనా హస్తం ఉందనే వాదన వినిపిస్తోంది.

అభివృద్ధి పథంలో నడిపిన హసీనా

మతఛాందస శక్తుల పీచమణచే  లౌకికవాదిగా, బంగ్లా ఆర్థికప్రగతి చోదకురాలిగా, ప్రపంచ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ బంగ్లాను ఒక ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేసిన కీర్తి షేక్​హసీనాకు దక్కుతుంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వృద్ది,  విద్య,- వైద్య రంగాల్లో  ప్రగతివల్ల  మానవాభివృద్ది సూచీలో  మెరుగైన స్థానం ఆమె ప్రభుత్వ చలవే అంటారు. కానీ,  ప్రతిపక్షమే లేకుండా చేస్తాననే నియంతృత్వ  పోకడ, వ్యతిరేకించే- నిరసన తెలిపేవారిపై  కఠినంగా నిర్బంధం అమలుచేసే చండశాసను రాలిగా విమర్శలున్నాయి.  

బంగ్లాపై డ్రాగన్​ కుయుక్తి

విపక్షనేత ఖలీదా జియా, ఇతర నాయకులతోపాటు ముప్ఫైవేలమంది వ్యతిరేకులను జైళ్లపాలుచేసి, తూతూ మంత్రపు ఎన్నికల్లో నెగ్గి,  ఓ నియంతలా పాలన సాగిస్తున్నారనేది ఆమెపై  ప్రధాన ఆరోపణ!  భారత్ ఇరుగుపొరుగు దేశాల్లో కాలుపెట్టి, దక్షిణాసియాలో పాగా వేయడానికి  చైనా నెరపుతున్న సామ్రాజ్యవాద  వైఖరి వల్లే  ప్రస్తుత బంగ్లా సంక్షోభమనే మాట ఉంది. ఇబ్బడిముబ్బడిగా రుణమిచ్చి, తీర్చలేని స్థితిలో... నౌకాశ్రయాలు, సైనిక స్థావరాల ఏర్పాటు ద్వారా చొరబడాలన్నది డ్రాగన్  కుయుక్తి.  బంగ్లాలో అలజడి ద్వారా భారత్​లోకి తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడానికి మతఛాందస వాదాన్ని రెచ్చగొట్టే పాకిస్తాన్ ఎప్పుడూ కాచుకునే ఉంటుంది. అంతర్జాతీయ పరిస్థితులపై భారత్ ఆచితూచే అడుగులు వేయాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్​లో అధికారికంగా ఉన్న పందొమ్మిది వేల మంది, అనధికారికంగా ఉన్న లక్షలమంది భారతీయుల ప్రయోజనాలు భారత్​కు ముఖ్యమే! 

పార్టీలకు ఆత్మపరిశీలన అవసరం

అధికారం శాశ్వతమనుకునో,  శాశ్వతం చేసుకోవాలనే యావతోనో ప్రతిపక్షమే లేకుండా చేయాలనే పెడధోరణి భారత్​లోనూ ఎక్కువయింది. విమర్శను అంగీకరించని నియంతృత్వ ధోరణిని ఎమెర్జెన్సీ కాలం నుంచి నేటివరకు.. ప్రజలు తిప్పికొడుతూనే ఉన్నారు.  దానికి విరుగుడుగా భావించి పాలకులు  పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని తీవ్ర నిర్బంధాలను అమలుపరుస్తున్నారు. దాంతో విధిలేక  ప్రజలు ఓపికగా ఉంటూ,  ప్రభుత్వాల పట్ల,  ప్రజావ్యతిరేక విధానాల పట్ల తమ అయిష్టతను ఓట్ల రూపంలో ఎన్నికలప్పుడు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ప్రజాతీర్పును కూడా వంచిస్తూ ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని రాత్రికి రాత్రి పార్టీలు మార్పించి పాలకులు పబ్బం గడుపుకుంటున్నారు. తాము కట్టే పన్నులు ఉపయోగపడక,  బతుకులు మెరుగుపడక,  అభిప్రాయాలకు విలువలేక, తామిచ్చే తీర్పులకూ దిక్కులేనప్పుడు... తిరుగుబాటు ఒకటే ప్రజలకు మార్గంగా కనిపించొచ్చు! అపుడు ఒక శ్రీలంక కథో,  మరొక బంగ్లా బాటనో పునరావృతం కావడం ఖాయం!

భారత్​కు పరీక్షే!

బంగ్లాదేశ్ సంక్షోభం భారత్​కు పరీక్ష.  సుదీర్ఘ  సరిహద్దు,  భౌగోళికంగా భారత  ప్రధాన భూభాగానికి ఈశాన్య భారతానికీ మధ్య నెలవైన నేల బంగ్లా!  షేక్ హసీనా భారత్ అనుకూల వైఖరి కనబరుస్తారని, అక్కడి విపక్ష నేత ఖలీదా జియా భారత్ వ్యతిరేక వైఖరి వహిస్తారని రాజకీయవర్గాల్లో ప్రచారముంది. బంగ్లా విముక్తి స్వాతంత్ర్యోద్యమానికి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ప్రత్యక్షంగా మద్దతిచ్చారు. పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) విడిపోవాలని సాగిన నాటి స్వాతంత్ర్యోద్యమానికి నేతృత్వం వహించింది  అవామీలీగ్  నేత  షేక్  ముజీబుర్ రెహమాన్. బంగ్లా జాతిపితగా కీర్తించబడే రెహమాన్ కూతురే ఈ షేక్ హసీనా!  

మనమూ నేర్చుకోవాలి

నిన్నటి శ్రీలంక అనుభవాలు,నేటి బంగ్లా పరిణామాల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలానే ఉంది.  ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం కన్నా ఏదీ ఎక్కువ కాదు.  ఎప్పుడో అర్ధశతాబ్దం కిందటి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారి పిల్లలకు చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇంకా కొనసాగించడం, అది కూడా 30 శాతం అంటే! నిరుద్యోగ ప్రపంచం ఎలా జీర్ణించుకోగలదు?  దేశ జనాభాలో  ఒకశాతం కూడా లేని 0.13 శాతం ఉన్నవారికి 30 శాతం రిజర్వేషన్లు కల్పించి, రెండున్నర కోట్ల మంది నిరుద్యోగుల్ని రోడ్ల మీద వదిలేస్తే  పరిస్థితులు ప్రతికూలంగా మారతాయి.  రిజర్వేషన్లను 30 నుంచి 7 శాతానికి, అటుపై ఒక శాతానికి తగ్గించినా, అంత వద్దని కోర్టు రద్దు చేసినా... పునరుద్ధరించడంపాలకుల అహంభావానికి ప్రతీక. అదే ప్రజాగ్రహానికి ప్రేరణ! 

- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్, 
పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ