- డాలీవుడ్ గజ గజ
- కర్రలతో కొట్టి హీరో, నిర్మాత హత్య
- జానపద గాయకుడు రాహుల్ ఆనందో ఇంటికి నిప్పు
- హిందువుల ఇండ్లపై కొనసాగుతున్న దాడులు
ఢాకా: బంగ్లాదేశ్ నెలకొన్న అశాంతి మత హింసగా మారుతోంది. దేశంలో చెలరేగిన అల్లర్లతో ప్రధాని తన పదవికి రాజీనామా చేసి పారిపోయిన తరువాత కూడా కంటిన్యూ అవుతున్నాయి. బంగ్లాదేశీ జానపద గాయకుడు రాహుల్ ఆనందో ఇంటిని దోచుకుని నిప్పు పెట్టారు. మంటల్లో మూడు వేలకు పైగా సంగీత వాయిద్యాలు కాలి బూడిదయ్యాయి. విలువైన వస్తువులను దొంగిలించారు. రాహుల్ కుటుంబం అక్కడినుంచి పారిపోయింది. ప్రస్తుతం ఆ ఫ్యామిలీ రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్లు బంగ్లాదేశ్ వార్తాపత్రిక ది డైలీ స్టార్ పేర్కొంది. ఆందోళనకారులు అవామీ లీగ్ నేతలను లక్ష్యంగా చేసుకుని వారిని ఊచకోత కోస్తున్నారు. ఇప్పటివరకు 20కు పైగా మృతదేహాల గుర్తించారు.
ముజీబుర్ బయోపిక్ హీరో, నిర్మాత హత్య
షేక్ హసీనా తండ్రి బంగబంధు ముజిబుర్ రెహమాన్ బయోపిక్ లో హీరోగా నటించిన శాంతో ఖాన్ అతని తండ్రి సినిమా నిర్మాత, దర్శకుడు సలీమ్ దారుణ హత్యకు గురయ్యారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అవామీలీగ్ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకొని అల్లరిమూకలు హింసాకాండకు దిగుతున్నాయి. బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం, కెరీర్ తొలినాళ్లలో జరిగిన సంఘటనల ఆధారంగా బంగ్లాదేశ్‌కు చెందిన దర్శకనిర్మాత సలీమ్ ఖాన్ 2021లో ఓ సినిమాను తెరకెక్కించారు.
‘తుంగిపరార్ మియా భాయ్’ పేరుతో నిర్మించిన ఈ సినిమాలో సలీమ్ కుమారుడు, నటుడు శాంతో ఖాన్ హసీనా తండ్రి రెహమాన్ యుక్తవయసు పాత్రను పోషించాడు. ఈ సినిమాతో శాంతో ఖాన్ కెరీర్ మలుపుతిరిగింది. హసీనా రాజీనామా చేశారన్న వార్త బయటకు రాగానే శాంతో, సలీమ్‌ను ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రీకుమారులు చాంద్‌పుర్‌లోని తమ స్వగ్రామానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యలో ఆందోళనకారులు వీరిని అడ్డుకున్నారు. ఆత్మరక్షణ కోసం వీరు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే నిరసనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు.