ఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా మరికొన్ని రోజులు భారత్లోనే ఉండక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆశ్రయం కల్పించేందుకు ఇతర దేశాల నుంచి ఆమెకు ఎదురుగాలి వీస్తుండటంతో మరో రెండు రోజుల పాటు భారత్లోనే ఆమె ఉండే పరిస్థితి ఉంది. ఆమెకు ఆశ్రయం కల్పించేందుకు ఇమ్మిగ్రేషన్ రూల్స్లో ఎలాంటి వెసులుబాటు లేదని యూకే స్పష్టం చేసింది. ఆశ్రయం కోరుతూ తాత్కాలిక శరణార్థిగా రావాలనుకునే వారికి బ్రిటీష్ ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం అనుమతి లేదని యూకే తేల్చి చెప్పింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించేందుకు యూకే సిద్ధంగా లేదని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక.. ఆమె ‘ఫ్యామిలీ ఆప్షన్స్’ను ఎంచుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఫిన్లాండ్, యూఎస్లో హసీనా కుటుంబ సభ్యులు స్థిరపడ్డారు. అయితే.. అమెరికా కూడా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని రాకను స్వాగతించేందుకు సిద్ధంగా లేదు. బంగ్లాదేశ్లో రేగిన అల్లర్ల కారణంగా దేశం విడిచి భారత్కు చేరుకున్న షేక్ హసీనా వీసాను అమెరికా రద్దు చేసినట్లు సమాచారం. అమెరికా చట్టాల ప్రకారం.. వీసా రికార్డ్స్ గోప్యంగా ఉంచాలి. అందువల్ల షేక్ హసీనా వీసా రద్దుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయడం లేదని ఢాకాలోని యూఎస్ ఎంబసీ ప్రతినిధి చెప్పారు.
హసీనా పార్టీకి సంబంధించిన పలువురు నేతల వీసాలపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించింది. కొన్నేళ్ల నుంచి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు, అమెరికాకు సత్సంబంధాలు కొరవడ్డాయి. బంగ్లాదేశ్లో గత జనవరిలో జరిగిన ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఆందోళనలు అణచివేయడం కోసం హింసాత్మక మార్గాన్ని షేక్ హసీనా ఎంచుకున్నారని అమెరికా గుర్రుగా ఉంది. షేక్ హసీనాకు యూకే, యూఎస్ నుంచి లైన్ క్లియర్ కాలేదు. అయ్యేలా కూడా లేదు. కొన్ని రోజులు ఆమె ఇండియాలోనే ఉండే పరిస్థితి ఉండటంతో హసీనా, భారత ప్రధాని మోదీ సమావేశానికి సెక్యూరిటీ ఏజెన్సీలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే.. షేక్ హసీనా, ప్రధాని మోదీ సమావేశం ఎప్పుడనే విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు.
బంగ్లాదేశ్ 1971 మార్చిలో పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఆ సమయంలో తొమ్మిది నెలలు జరిగిన ఈ అంతర్యుద్ధంలో 30 లక్షల మంది అమరులయ్యారు. 2022 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ జనాభా 17.12 కోట్లు. తాజాగా షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం 1971 అమరుల వారసులకు ఉద్యోగాల్లో 30 రిజర్వేషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు చేశారు. రోడ్లు, రైల్వే లైన్లను ముట్టడించారు.
ఈ రిజర్వేషన్లతో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకే ప్రయోజనం చేకూరుతుందని ఆరోపించారు. రిజర్వేషన్ల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పన్నులు, బిల్లులు ఏవీ కట్టొద్దని ప్రజలను కోరారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థల్ని, ఫ్యాక్టరీలను మూసేయాలని ఉద్యమించారు. ఆందోళనలు అల్లర్లకు దారితీశాయి. హింసాత్మకంగా మారాయి. చిన్నగా మొదలైన ఉద్యమం దేశాన్ని అగ్నిగుండం చేసింది. ప్రధాని షేక్ హసీనా అధికార పీఠం వదిలి దేశం నంచి పారిపోయేలా చేసింది.