Champions Trophy: బుమ్రా లేడు, ఇంకెక్కడ టీమిండియా.. మేమే బలంగా ఉన్నాం: బంగ్లా మాజీ ఓపెనర్

Champions Trophy: బుమ్రా లేడు, ఇంకెక్కడ టీమిండియా.. మేమే బలంగా ఉన్నాం: బంగ్లా మాజీ ఓపెనర్

ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందనే సామెత బంగ్లాదేశ్ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. పసికూన జట్ల చేతిలో ఓడాక.. ఆ టీమ్ ఉన్న సంగతే అందరూ మర్చిపోతే.. బంగ్లా ఆటగాళ్ల ప్రగల్భాలకు మాత్రం హద్దు లేకుండా పోతోంది. ఆ జట్టు క్రికెటర్లు, మాజీలు రోజుకొకరు చొప్పున మీడియా ముందుకొచ్చి అడ్డగోలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 

మొన్నటికి మొన్న ఆ జట్టు కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలు పంపాడు. తమ జట్టును తేలిగ్గా తీసుకోవద్దని.. కుర్రాళ్లు మంచి ఊపు మీదున్నారని అగ్రశ్రేణి జట్లను ఉద్దేశించి మాట్లాడాడు. ఛాంపియన్లుగా నిలిచి, ట్రోఫీతో బంగ్లా గడ్డపై కాలుపెట్టే సమయం వచ్చిందని ప్రగల్భాలు పలికాడు. తాజాగా, ఆ జట్టు మాజీ ఓపెనర్ ఇమ్రుల్ కయేస్.. టీమిండియాను ఓడించే సమయం వచ్చిందని మాట్లాడాడు. 

బుమ్రా లేడు.. ఇదే మంచి సమయం

బుమ్రా లేకపోవడం వల్ల భారత బౌలింగ్ లైనప్ బలహీనంగా ఉందని కయేస్ వ్యాఖ్యానించాడు. ఆరంభంలో దూకుడుగా ఆడితే, టీమిండియాను ఈజీగా ఒత్తిడిలోకి నెట్టొచ్చని అభిప్రాయపడ్డాడు. 

“బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ టీమిండియా బలమైన జట్టు. కాదనలేం. కానీ ప్రస్తుత జట్టులో బుమ్రా లేడు. గత రెండేళ్లుగా అతడు భారత జట్టుకు ఏమి చేశాడో.. ఎన్ని విజయాలు అందించి పెట్టాడో మనందరికీ తెలుసు. అతని లేకపోవడం బంగ్లాదేశ్‌కు అదనపు ప్రయోజనం. ఒక రకంగా భారత జట్టు కంటే.. మా టీమ్ కొంచెం బలంగానే కనిపిస్తోంది..” అని బంగ్లా మాజీ ఓపెనర్ ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. 

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడబోయే తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తోనే. ఫిబ్రవరి 20న ఈ మ్యాచ్‌ జరగనుంది.