- 21 రన్స్‌తో నేపాల్‌పై బంగ్లాదేశ్ గెలుపు
- సూపర్-8 రౌండ్‌కు అర్హత
కింగ్‌స్టన్ : పేసర్ తంజిమ్ హసన్ షకీబ్ (4/7) కెరీర్ బెస్ట్ బౌలింగ్ చేస్తూ 21 డాట్ బాల్స్ వేయడంతో నేపాల్‌ను కట్టడి చేసిన బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్‌లో సూపర్8 రౌండ్‌కు దూసుకొచ్చింది. సోమవారం జరిగిన గ్రూప్–డి మ్యాచ్‌లో చిన్న స్కోరును అద్భుతంగా కాపాడుకున్న బంగ్లా 21 రన్స్ తేడాతో నేపాల్‌పై విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓ ఓటమి, మూడు విజయాలతో మొత్తం ఆరు పాయింట్లతో గ్రూప్–డిలో రెండో ప్లేస్‌తో టోర్నీలో ముందంజ వేసింది.
సౌతాఫ్రికా ఇప్పటికే సూపర్–8లో అడుగు పెట్టింది. ఈ లో స్కోరింగ్ పోరులో బంగ్లా తొలుత 19.3 ఓవర్లలో 106 రన్స్‌కే ఆలౌటైంది. షకీబ్ అల్ హసన్ (17) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లు తలో చేయి వేసి స్కోరు వంద దాటించారు. నేపాల్ బౌలర్లలో సోంపాల్, దీపేంద్ర సింగ్, రోహిత్ పాడెల్, సందీప్ లమిచానె తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో నేపాల్ 19.2 ఓవర్లలో 85 రన్స్‌కే ఆలౌటై ఓడింది.
కుశాల్ మల్ల (27), దీపేంద్ర సింగ్ (25) పోరాడినా ఫలితం లేకపోయింది. బంగ్లా బౌలర్లలో తంజిమ్‌కు తోడు ముస్తాఫిజుర్ రహ్మన్ (3/7), షకీబ్ హసన్ (2/9) ప్రత్యర్థిని అడ్డుకున్నారు. తంజిమ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
బంగ్లా కష్టంగా..
గత మ్యాచ్‌లో బలమైన సౌతాఫ్రికాను ఓడించినంత పని చేసిన నేపాల్ ఈ పోరులో బంగ్లాను భయపెట్టింది. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకొని వరుస వికెట్లతో ప్రత్యర్థిని హడలెత్తించింది. ఇన్నింగ్స్ తొలి బాల్‌కే తంజిద్ హసన్ (0)ను సోంపాల్ రిటర్న్ క్యాచ్‌తో గోల్డెన్ డకౌట్ చేయగా.. రెండో ఓవర్లో కెప్టెన్ నజ్ముల్ శాంటో (4)ను దీపేంద్ర క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపు ప్రతిఘటించిన లిటన్ దాస్ (10)ను ఐదో ఓవర్లో సోంపాల్ వెనక్కు పంపగా.. రోహిత్ బౌలింగ్‌లో తౌహిద్ హృదయ్ (9) పెవిలియన్ చేరడంతో బంగ్లా 30/4తో కష్టాల్లో పడింది.
షకీబ్, మహ్ముదుల్లా (13) ఐదో వికెట్‌కు 22 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, షకీబ్ తప్పిదంతో మహ్ముదుల్లా రనౌట్ అవ్వడంతో బంగ్లా సగం వికెట్లు కోల్పోయింది. కొద్దిసేపటికే రోహిత్ బౌలింగ్‌లో షకీబ్ ఎల్బీ అవ్వగా.. తంజిమ్ హసన్ (3) నిరాశ పరిచాడు. దాంతో 69/7తో బంగ్లా కష్టాలు మరింత పెరిగాయి. నేపాల్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నా.. జాకెర్ అలీ (12),రిషద్ హసన్ (13), తస్కిన్ అహ్మద్ (12 నాటౌట్) విలువైన రన్స్ అందించారు. ఎక్స్‌ట్రాల రూపంలో పది రన్స్ రావడంతో బంగ్లా స్కోరు వంద దాటింది.
తంజిమ్, ముస్తాఫిజుర్ కట్టడి
చిన్న స్కోరును కాపాడుకునే ప్రయత్నంలో బంగ్లా బౌలర్లు విజృంభించడంతో ఛేజింగ్‌లో నేపాల్ కూడా తడబడింది. ముఖ్యంగా పేసర్లు తంజిమ్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మద్ ఏడు వికెట్లు పడగొట్టడంతో పాటు తమ ఎనిమిది ఓవర్లలో మూడు మెయిడిన్స్ చేశారు. మొత్తం 41 డాట్ బాల్స్ వేసి నేపాల్ బ్యాటర్లను నిలువరించారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వరుస బాల్స్‌లో ఓపెనర్ కుశాల్ భుర్టెల్ (4), వన్ డౌన్ బ్యాటర్ అనిల్ షా (0)ను ఔట్ చేసిన తంజిమ్ ప్రత్యర్థి పతనాన్ని ఆరంభించాడు. తన తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ పాడెల్ (1)ను కూడా వెనక్కు పంపాడు.
మరో ఎండ్‌లో కాసేపు ప్రతిఘటించిన ఆసిఫ్ షేక్ (17)ను ముస్తాఫిజుర్ ఔట్ చేయగా.. తంజిమ్ వేసిన ఏడో ఓవర్లో సందీప్ జోర (1) కూడా పెవిలియన్ చేరడంతో నేపాల్ 26 రన్స్‌కే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కుశాల్ మల్లా, దీపేంద్ర నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. బంగ్లా బౌలర్లను కాచుకున్న ఈ ఇద్దరూ స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండ్రీలు రాబట్టడంతో నేపాల్ రేసులోకి వచ్చేలా కనిపించింది.
కానీ, 17వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన ముస్తాఫిజుర్ ఊరించే బాల్‌తో కుశాల్ మల్లాను క్యాచ్ ఔట్ చేసి ఆరో వికెట్‌కు 52 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. దాంతో మ్యాచ్ బంగ్లా చేతుల్లోకి వెళ్లింది. దీపేంద్ర కూడా ముస్తాఫిజుర్ బౌలింగ్‌లోనే వెనుదిరగ్గా.. తస్కిన్, షకీబ్ దెబ్బకు చివరి నలుగురు బ్యాటర్లు సున్నా చుట్టడంతో నేపాల్ ఆలౌటైంది.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్ : 19.3 ఓవర్లలో 106 ఆలౌట్ (షకీబ్ అల్ హసన్ 17, రిషద్ 13, సోంపాల్ 2/10, లమిచానె 2/17).
నేపాల్ : 19. 2 ఓవర్లలో 85 ఆలౌట్ (కుశాల్ మల్లా 27, దీపేంద్ర 25, తంజిమ్ 4/7, ముస్తాఫిజుర్ 3/7)