చెన్నై టెస్టులో భారత పేసర్ల ధాటికి బంగ్లాదేశ్ కుదేలైంది. కనీస పోరాటం లేకుండా తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 32 పరుగులు చేసిన షకీబ్ ఉల్ హసన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. శాంటో (20) , లిటన్ దాస్ (22), మెహదీ హసన్ మిరాజ్ (27) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్, జడేజా,సిరాజ్ లకు తలో రెండు వికెట్లు లభించాయి.
పాకిస్థాన్ పై వారి సొంతగడ్డపై సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ తక్కువ స్కోర్ కే పరిమితమైంది. బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ చెలరేగడంతో ఒక దశలో బంగ్లా 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో షకీబ్, లిటన్ దాస్ ఆరో వికెట్ కు 51 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే జడేజా ఈ జోడీని విడదీయడంతో బంగ్లా మిగిలిన వికెట్లను చక చక కోల్పోయింది.
అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ సెంచరీ (113) తో చెలరేగగా.. జడేజా (86), జైశ్వాల్ (56) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమ్మద్ కు ఐదు వికెట్లు దక్కాయి. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ లో భారత్ విజయం ఖాయంగానే కనిపిస్తుంది.