బంగ్లాదేశ్లో ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో తలెత్తిన రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దిన్ పార్లమెంట్ను రద్దు చేశారు. ఈ పరిణామంతో జనవరి 7న జరిగిన బంగ్లాదేశ్12వ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ప్రభుత్వం రద్దై పోయింది. అంతేకాదు.. బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. షేక్ హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. 2018 నుంచి ఆమె అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవించారు.
షేక్ హసీనా రాజీనామాతో ఆమె ప్రత్యర్థి, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదా జియాకు జైలు నుంచి విముక్తి లభించింది. ఇక.. బంగ్లాదేశ్లో జులై 1 నుంచి ఆగస్టు 5 వరకూ జరిగిన అల్లర్ల కారణంగా అరెస్ట్ చేసిన నిరసనకారులను కూడా విడుదల చేశారు. హసీనా ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్ కోటా విధానంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
1971లో జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో అమరులైన వారి కుటుంబంలోని వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ను హసీనా ప్రభుత్వం అమలు చేసింది. ఈ రిజర్వేషన్ కోటా వల్ల హసీనా పార్టీ మద్దతుదారుల పిల్లలకే ఉద్యోగాలు వస్తు్న్నాయని, ఇతరులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు రోడ్లెక్కారు. ఈ రిజర్వేషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని విద్యార్థులు చేసిన నిరసన జులై నెలలో పతాక స్థాయికి చేరింది.
నిరసనలు హింసాత్మకంగా మారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ అల్లర్లలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేశారు. ఆగస్ట్ 5న పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. నిరసనకారులు నేరుగా ప్రధాని అధికారిక నివాసంలోకి కూడా ప్రవేశించారు. దీంతో.. ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్కు చేరుకున్నారు. తనకు ఆశ్రయం కల్పించాలని యూకేను షేక్ హసీనా కోరారు. యూకే అనుమతి వచ్చిన వెంటనే ఆమె భారత్ నుంచి అక్కడికి వెళ్లిపోతారు.