ఆర్‌ఎస్‌ఎస్, హిందూగ్రూపులపై దాడులకు ప్లాన్.. 8 మంది అనుమానితులను అరెస్ట్ చేసిన అస్సాం ఎస్టీఎఫ్

ఆర్‌ఎస్‌ఎస్, హిందూగ్రూపులపై దాడులకు ప్లాన్.. 8 మంది అనుమానితులను అరెస్ట్ చేసిన అస్సాం ఎస్టీఎఫ్

గౌహతి/న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్, ఇతర హిందూ గ్రూపుల సభ్యులు లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసిన అనుమానిత టెర్రరిస్టులను అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 17, 18 తేదీల్లో కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో ఎనిమిది మంది అనుమానితులను అరెస్టు చేసినట్టు ఎస్టీఎఫ్ తెలిపింది. కేరళలో అరెస్టు అయిన టెర్రరిస్టుల్లోఅల్-ఖైదా అనుబంధ సభ్యుడిగా ఉన్న బంగ్లాదేశ్‌కు చెందిన టెర్రరిస్ట్ ఎండీ సాద్ రాడి అకా ఎండి షాబ్ సేఖ్ కూడా ఉన్నాడని అస్సాం స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హర్మీత్ సింగ్ తెలిపారు. అరెస్టయిన ఇతర ఏడుగురు నిందితులను మినారుల్ షేక్, ఎండీ అబ్బాస్ అలీ, నూర్ ఇస్లాం మండల్, అబ్దుల్ కరీం మండల్, మోజిబర్ రెహమాన్, హమీదుల్ ఇస్లాం, ఇనాముల్ హక్ గా గుర్తించారు.

బెంగాల్‌లోని ముర్షిదాబాద్, కోల్ కతాలో అనేక సమావేశాలు జరిగాయని, అక్కడ నూర్ ఇస్లాం మండల్, అతని సహచరులు.. ఆర్ఎస్ఎస్, ఇతర హిందూ గ్రూపుల సభ్యులను లక్ష్యంగా చేసుకోవడంపై విస్తృతంగా చర్చించారని ఎస్టీఎఫ్ తెలిపింది. ప్రముఖ మత, హిందూ నాయకులను హత్య చేసేందుకు ప్రణాళికలు రచించారని వెల్లడించింది. దాంతో మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించడం, మత సామరస్యానికి భంగం కలిగించడం వారు లక్ష్యంగా చేసుకున్నారని ఎస్టీఎఫ్ స్పష్టం చేసింది. సాద్ రాడి.. బెంగాల్, అస్సాం నుంచి కేరళకు మకాం మార్చాడని, తాము అతన్ని కేరళలో పట్టుకున్నామని డీజీపీ హర్మీత్ సింగ్ తెలిపారు. వారి ప్రణాళికలు అస్సాం, బెంగాల్ కంటే చాలా పెద్దవిగా ఉన్నాయని, వాటిని తాము మొగ్గలోనే తుంచివేశామని ఆయన పేర్కొన్నారు.