- బంగ్లా పేసర్ తస్కిన్ నిర్వాకం
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగడం, తుది జట్టులో వైస్ కెప్టెన్ తస్కిన్ అహ్మద్ లేకపోవడం చర్చనీయాంశమైంది. తస్కిన్‌పై వేటు వేశారని ప్రచారం జరిగింది. హెడ్ కోచ్ చందిక హతురుసింఘతో అతనికి పడటం లేదన్న వార్తలు వచ్చాయి. అయితే, నిద్రమత్తు కారణంగా టీమ్ బస్సు మిస్సయిన తస్కిన్ తుది జట్టులోనూ చోటు కోల్పోయాడన్న విషయం ఆలస్యంగా తెలిసింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధికారి ఒకరు వెల్లడించారు.
నిద్రమత్తులో ఫోన్ కూడా ఎత్తకుండా, సమయానికి జట్టుతో కలవనందుకు తస్కిన్ అందరికీ క్షమాపణలు చెప్పాడని తెలిపారు. ‘తస్కిన్ టీమ్ బస్ మిస్ చేసుకొని తర్వాత జట్టులో చేరాడన్నది నిజం. అయితే, అతడిని ఎందుకు ఆడించలేదో హెడ్ కోచ్‌కే తెలియాలి’ అని పేర్కొన్నారు. ఈ ఇద్దరి మధ్య విభేదాలు లేవని, ఒకవేళ ఉంటే అఫ్గానిస్తాన్‌తో తర్వాతి మ్యాచ్‌లో తస్కిన్ ఎలా ఆడతాడని అన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఇండియా 50 రన్స్ తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది.