- ఉన్న ఫళంగా రాజీనామా చేసి ఆర్మీ విమానంలో భారత్‌కు..
- రాజకీయ ఆశ్రయం కోసం అర్ధరాత్రి బ్రిటన్‌కు పయనం
- ఫ్రీడమ్ ఫైటర్ల పిల్లలకు 30% కోటాపై తీవ్రమైన నిరసనలు
- ఆర్మీ హెచ్చరికతో ఒక్కపూటలోనే కుప్పకూలిన అవామీ లీగ్ సర్కార్
- తాత్కాలిక సర్కార్ ఏర్పాటు చేస్తాం: ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్
- హింసకు ముగింపు పలకాలని నిరసనకారులకు పిలుపు
- యూపీలోని ఎయిర్ బేస్‌లో హసీనాను కలిసిన దోవల్
ఢాకా : బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా సర్కారు ఒక్క పూటలోనే కుప్పకూలింది. దేశంలో నెల రోజులుగా జరుగుతున్న నిరసనలు పతాకస్థాయికి చేరడం.. సోమవారం సైన్యం రంగంలోకి దిగడంతో ప్రధాన మంత్రి పదవికి హసీనా రాజీనామా చేశారు. ఆ వెంటనే దేశం విడిచి వెళ్లిపోయారు. దేశ పాలన బాధ్యతలను
తమ చేతిలోకి తీసుకుంటున్నట్టు ఆర్మీ చీఫ్జనరల్ వకార్ ఉజ్ జమాన్ ప్రకటించారు. దీంతో షేక్ హసీనా(76) నేతృత్వంలోని అవామీ లీగ్ సర్కారు పదిహేనేండ్ల పాలనకు ఒక్కపూటలోనే తెరపడినట్టయింది.
దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడం.. శాంతి భద్రతల పరిస్థితి చేయి దాటిపోవడంతో చివరకు ఆర్మీ సోమవారం రంగంలోకి దిగింది. ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ హసీనాకు అల్టిమేటం జారీ చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేసిన హసీనా దేశం నుంచి పారిపోయి భారత్ చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆమె మంగళవారం తెల్లవారుజామున లండన్‌కు వెళ్లి ఆశ్రయం పొందనున్నట్టు తెలుస్తోంది.
పతాక స్థాయికి నిరసనలు..
హసీనా సర్కారుకు వ్యతిరేకంగా నెలరోజులుగా జరుగుతున్న నిరసనల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. 300కుపైగా మంది బలైపోయారు. ఆదివారం ఒక్కరోజే 14 మంది పోలీసులు సహా 101 మంది మృతి చెందారు. వెయ్యి మంది వరకూ గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం ‘లాంగ్ మార్చ్ టు ఢాకా’ కార్యక్రమంలో పాల్గొనాలంటూ దేశ ప్రజలకు ఆందోళనకారులు పిలుపునిచ్చారు.
దీంతో ఉదయం నుంచే దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. ఢాకాలో పెద్ద ఎత్తున పోలీసు, ఆర్మీ బలగాలను మోహరించారు. మధ్యాహ్నం వరకూ ఎక్కడా పెద్దగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తిరిగి ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. కర్ఫ్యూను ధిక్కరిస్తూ ఢాకా వీధుల్లోకి మార్చ్ కోసం వేలాది మంది వచ్చినా.. ఉదయం నుంచి శాంతియుతంగానే నిరసనలు కొనసాగాయి. కానీ నిరసనకారులకు వ్యతిరేకంగా అవామీ లీగ్ మద్దతుదారులు సైతం రోడ్ల మీదకు రావడంతోనే క్రమంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. సోమవారం జరిగిన ఘర్షణల్లో మరో ఆరుగురు చనిపోయారు.
మధ్యాహ్నం కల్లా కథ ముగిసింది..
దేశంలో శాంతి భద్రతల పరిస్థితి చేయిదాటడంతో సోమవారం మధ్యాహ్నం కల్లా ఆర్మీ రంగంలోకి దిగింది. ప్రధాని పదవి నుంచి దిగిపోవాలంటూ షేక్ హసీనాకు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ అల్టిమేటమ్ జారీ చేశారు. రాజీనామా చేసేందుకు ఆమెకు 45 నిమిషాల గడువు మాత్రమే ఇచ్చారు. సైన్యం హెచ్చరించడంతో తప్పనిసరై హసీనా రాజీనామా చేశారు.
దీంతో తన చెల్లెలు షేక్ రెహానాతో కలిసి ఆర్మీ హెలికాప్టర్ లో అధికారిక నివాసం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ సీ130జే రవాణా విమానంలో సాయంత్రం 5.30 గంటలకల్లా భారత్ కు చేరుకున్నారు. ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలోని ఘజియాబాద్ (యూపీ)లో ఉన్న హిండన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో ఆమె ల్యాండ్ అయ్యారు. రాత్రి లండన్‌కు వెళ్లిపోయారు.
హసీనాను కలిసిన అజిత్ దోవల్
హిండన్ ఎయిర్ బేస్ లో షేక్ హసీనాను జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కలిశారు. బంగ్లాలో కొనసాగుతున్న సంక్షోభం, తన భవిష్యత్తు ప్రణాళికపై ఆమె దోవల్ తో చర్చించినట్టు తెలుస్తోంది. షేక్ హసీనాను భారత్ మిత్రురాలిగా పరిగణిస్తూ వస్తోంది. ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ పాలన పట్ల కూడా కేంద్రం సానుకూల వైఖరిని కొనసాగిస్తోంది. అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో హసీనా ప్రధాని మోదీని కలుస్తారా? లేదా? అన్నది వెల్లడికాలేదు. కాగా, హసీనా కుమార్తె సైమా వాజేద్ ఢిల్లీలోని డబ్ల్యూహెచ్ఓ సౌత్ ఈస్ట్ ఏసియా డైరెక్టర్ గా పని చేస్తున్నారు. హిండన్ ఎయిర్ బేస్ నుంచి లండన్ కు వెళ్లే ముందు హసీనా తన కుమార్తెను కలిసినట్లు తెలుస్తోంది.
ప్రధాని నివాసం లూటీ
షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత ఆర్మీ కర్ఫ్యూను సైతం లెక్కచేయకుండా వేలాది మంది నిరసనకారులు ఢాకాలోని ప్రధాన మంత్రి అధికారిక నివాసం ‘గణభాబన్’ భవనంలోకి చొరబడి లూటీ చేశారు. కొందరు ఫర్నిచర్ ను ధ్వంసం చేస్తూ విధ్వంసానికి పాల్పడగా.. మరికొందరు టీవీలు, సూట్ కేసులు, ఇతర వస్తువులు ఏవి దొరికితే అవి పట్టుకుపోయారు.
కొందరు కిచెన్ లోకి వెళ్లి చికెన్, ఫిష్, ఇతర వంటకాలను తింటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంకొందరు హసీనా వినియోగించిన బెడ్ రూంకు వెళ్లి బెడ్ పై పడుకుని పోజులు ఇస్తూ, మరికొందరు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ వీడియోలు తీసి పోస్ట్ చేయగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హసీనా తన అధికారిక నివాసం నుంచి ఆర్మీ హెలికాప్టర్ లో వెళ్లిపోతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
హింసను ఆపండి: ఆర్మీ చీఫ్
హసీనా రాజీనామా తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారు. ‘‘ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. మిలిటరీ త్వరలోనే మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నిరసన కారులు ఇప్పటికైనా శాంతించాలి. లేదంటే ఎమర్జెన్సీ విధించాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు. ‘‘దేశంలో సంక్షోభం నెలకొంది. ప్రతిపక్ష నేతలతో చర్చించాను. దేశాన్ని నడిపించేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని, మీ ప్రాణాలు, ఆస్తులను కాపాడతాను. మీ డిమాండ్లను నెరవేరుస్తాం. హింసకు ముగింపు పలకండి” అని నిరసన కారులకు ఆర్మీ చీఫ్ విజ్ఞప్తి చేశారు.
చివరిరోజూ భారీగా విధ్వంసం
హసీనా పరార్ అయిన వార్తలు వెలువడగానే దేశవ్యాప్తంగా ఆందోళనకారులు సంబరాలు చేసుకుంటూ రెచ్చిపోయారు. ఢాకా వీధుల్లో నిరసనకారులు చెలరేగిపోయారు. ఢాకాలో హసీనా తండ్రి, బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రహమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ధన్మోండి, ఢాకాలోని అధికార అవామీ లీగ్ పార్టీ ఆఫీసులను తగలబెట్టారు.
దేశ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ నివాసంలోనూ విధ్వంసానికి పాల్పడిన అల్లరిమూకలు ఆ భవనానికి నిప్పు పెట్టారు. వీధుల్లో పెద్ద ఎత్తున వెహికల్స్ కు నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఇంటిలోకి, పార్లమెంట్ బిల్డింగ్ లోకి సైతం నిరసనకారులు చొరబడ్డారు. ఢాకా ఎయిర్ పోర్టులోకీ వందలాది మంది చేరుకుని, రన్ వేపై కలియతిరిగారు. సిల్హెట్ సిటీలో పోలీస్ కమిషనర్ ఆఫీసుకూ నిప్పుపెట్టారు.
పలువురు కౌన్సిలర్ల ఇండ్లపై దాడి చేశారు. ధన్మోండీలోని ఇందిరా గాంధీ కల్చరల్ సెంటర్ తోపాటు నాలుగు హిందూ టెంపుల్స్ పై కూడా దాడి చేశారు. ముజిబుర్ రహమాన్ స్మారకార్థం ఏర్పాటు చేసిన బంగబంధు మెమోరియల్ మ్యూజియాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. షేక్ హసీనా భర్త డాక్టర్ వాజేద్ మియా ఇంటిపై కూడా దాడి చేశారు.