40 మంది హసీనా మద్దతుదారుల అరెస్టు

40 మంది హసీనా మద్దతుదారుల అరెస్టు
  •  
  • హింసకు పాల్పడ్డారన్న యూనుస్  ప్రభుత్వం
  • శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరిక

ఢాకా: మాజీ ప్రధాని షేక్  హసీనా మద్దతుదారులపై బంగ్లాదేశ్  ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. విద్యార్థి సంఘం కార్యకర్తలపై హింసకు పాల్పడ్డారంటూ 40 మంది హసీనా మద్దతుదారులను అరెస్టు చేసింది. ఇందుకోసం ముహమ్మద్  యూనుస్  సర్కారు ‘ఆపరేషన్  డెవిల్  హంట్’ ను ప్రారంభించింది. కాగా.. షేక్  హసీనాకు చెందిన అవామీ లీగ్  పార్టీకి సంబంధించిన సైన్  బోర్డులు, చిహ్నాలను ధ్వంసం చేసేందుకు గాజీపూర్  సిటీలోని దక్షిణ్ ఖాన్  ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఒక అల్లరి మూక బయలుదేరింది.

 ఈ క్రమంలో అవామీ లీగ్  పార్టీ గుర్తులను మూక ధ్వంసం చేసింది. లిబరేషన్  వార్  అఫైర్స్  మాజీ మంత్రి  మొజమ్మిల్  హక్  నివాసంపై మూక దాడికి పాల్పడుతుండగా అవామీ లీగ్  పార్టీ సపోర్టర్లు అక్కడికి చేరుకుని మూకను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య హింస చెలరేగింది. ఈ హింసలో అల్లరి మూకకు చెందిన 14 మంది గాయపడ్డారు. అల్లరిమూకపై దాడిచేసిన వారిని పట్టుకునేందుకు యూనుస్  సర్కారు ఆపరేషన్  డెవిల్  హంట్ ను ప్రారంభించింది. విద్యార్థి సంఘం కార్యకర్తలపై హసీనా మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని, అందువల్లే 40 మంది మద్దతుదారులను అరెస్టు చేశామని హోం వ్యవహారాల సలహాదారు జహంగిర్  ఆలం చౌధురి చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఊరుకోబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.