T20 World Cup 2024: సరైన ప్రాక్టీస్ లేదు.. మేం ప్రపంచ కప్ గెలిచేది కష్టమే: బంగ్లా ఆల్‌రౌండర్

T20 World Cup 2024: సరైన ప్రాక్టీస్ లేదు.. మేం ప్రపంచ కప్ గెలిచేది కష్టమే: బంగ్లా ఆల్‌రౌండర్

మరో 25 రోజుల్లో టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం కానుండగా.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెగా టోర్నీ ముందు తమ జట్టు సన్నద్ధత గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్లయిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లతో సిరీస్‌లు లేనందున.. బంగ్లాదేశ్  జట్టు టీ20ప్రపంచకప్‌కు అత్యుత్తమ స్థాయిలో సిద్ధం కావడం లేదని షకీబ్ అభిప్రాయపడ్డాడు. 

బంగ్లా జట్టు ప్రస్తుతం.. స్వదేశంలో జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ మే 12న ముగియనుండగా.. మే 20 నుంచి అమెరికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇలా పసికూన జట్లతో తలపడి విజయాలు సాధించి ఆత్మ విశ్వాసంతో బరిలో దిగగలం తప్ప.. సరైన ప్రాక్టీస్ లభించదని షకీబ్ అల్ హసన్ వ్యాఖ్యానించాడు. తమ అంతర్జాతీయ, దేశీయ షెడ్యూల్‌లను భిన్నంగా సిద్ధం చేసి ఉండవచ్చని బంగ్లా ఆల్‌రౌండర్ అభిప్రాయపడ్డారు. 

"గత ప్రపంచ కప్‌లో మేము మంచి ప్రదర్శన చేశాము. ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. ఎవరినీ నిరాశ పరచలేదు. ఈ ప్రపంచ కప్‌లో మేము దానిని అధిగమించే అవకాశం ఉంది. అలా జరగాలంటే మొదటి రౌండ్‌లో మేం మూడు మ్యాచ్‌లు గెలవాలి. అమెరికాతో టీ20 సిరీస్.. అక్కడి పరిస్థితులు అంచనా వేయడానికి నిర్వహించారు. అది అంగీకరించదగినదే. కాకపోతే, దేశవాళీ టోర్నీ సూపర్ లీగ్ (డిపిఎల్)ని టి20 ఫార్మాట్‌లో ఆడితే బాగుండేది. ఈ వేడిలో రోజంతా గ్రౌండ్‌లో ఉండటం అమానుషం. దీన్ని మరింత బాధ్యతాయుతంగా నిర్వహించవచ్చు. ముందు టి20 ప్రపంచకప్ ఉంది. టీ20 ఫార్మాట్ లో మ్యాచ్ లు నిర్వహించివుంటే జాతీయ జట్టుకు ఉపయోగకరంగా ఉండేది.." అని షకీబ్ మీడియాతో మాట్లాడాడు. 

ఐసీసీ ఈవెంట్‌లో బంగ్లాదేశ్ గ్రూప్ డిలో శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, నేపాల్‌లతో కలిసి ఉంది. తమ తొలి మ్యాచ్ లో జూన్ 8న డల్లాస్‌ వేదికగా మాజీ ఛాంపియన్ శ్రీలంకతో తలపడనుంది.