ఢాకా: ఇండియా సరిహద్దులో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని ఆ దేశ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. సిల్హెట్‌లోని కనైఘాట్ సరిహద్దు గుండా భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ జడ్జి షంషుద్దీన్ చౌదురి మాణిక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్(బీజీబీ) హెడ్ ఆఫీస్ వెల్లడించింది. అవామీ లీగ్ నాయకుడు ఏఎస్ఎమ్ ఫిరోజ్‌ను అతని నివాసంలో అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది.
దాంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ ఆగస్టు 8న తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం హసీనా ప్రభుత్వంలో పనిచేసిన కీలక నేతలను, పలువురు ఉన్నతాధికారులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన నాయకులు సైనిక స్థావరాల్లో ఆశ్రయం పొందుతున్నట్లుగా అధికారులు వివరించారు.