IND vs BAN: భారత్ బలమైన జట్టే కాదనలేం.. మా ఆట చూస్తారు: బంగ్లా పేసర్

భారత్- బంగ్లాదేశ్ సిరీస్‌కు సమయం దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 19 నుంచి ఈ ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై ఆడుతుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశమైనప్పటికీ.. పాకిస్థాన్‌ను వారి గడ్డపైనే ఓడించిన బంగ్లా ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టు గురించి.. భారత పర్యటన గురించి బంగ్లా వర్ధమాన పేసర్ నహిద్ రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

టీమిండియాను కఠిన ప్రత్యర్థిగా అంగీకరించిన నహిద్ రానా.. భారత జట్టును ఓడించగల సత్తా తమలో ఉందని చెప్పుకొచ్చాడు. ఈ పర్యటనలో తన దేశం కోసం ఏదైనా సాధించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.

బాగా ఆడిన జట్టుదే విజయం

"సహజంగానే మేము ఇండియా సిరీస్‌కు బాగా సన్నద్ధమయ్యాము. మంచి ప్రాక్టీస్ లభించింది. భారత పిచ్‌లపై అవహగాన ఉంది. అందుకు తగ్గట్టే సిద్ధమయ్యాం.. భారత్ మంచి జట్టే, కఠిన ప్రత్యర్థే కాదనలేం.. కానీ మంచి క్రికెట్ ఆడే జట్టు గెలుస్తుంది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దాం.. ఈ పర్యటనలో నా దేశం కోసం ఏదైనా సాధించాలనుకుంటున్నా.. అలా ఆశించిన దాన్ని అందించడం చాలా గొప్పగా అనిపిస్తుంది.." అని రానా బంగ్లాదేశ్ క్రికెట్ 'ఎక్స్'లో పంచుకున్న వీడియోలో పేర్కొన్నాడు.

ALSO READ | ఇంగ్లండ్‎పై శ్రీలంక విజయం.. సొంతగడ్డపై ఇంగ్లీష్ టీమ్‏కు ఝలక్

గంటకు 152 కి.మీ వేగం

నిలకడగా గంటకు 152 కి.మీ వేగంతో బంతులేయగల ఈ పేసర్.. ఇటీవల పాక్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. పదునైన పేస్ కు తోడు  పర్ఫెక్ట్ లెంగ్త్, బౌన్స్ అతని సొంతం. అందువల్లే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నాడు.

భారత్- బంగ్లాదేశ్ షెడ్యూల్

  • మొదటి టెస్ట్: సెప్టెంబర్ 19- సెప్టెంబర్ 23(చెన్నై)
  • రెండో టెస్ట్: సెప్టెంబర్ 27-  అక్టోబర్ 01(కాన్పూర్)
  • తొలి టీ20: అక్టోబర్ 06 (గ్వాలియర్)
  • రెండో టీ20: అక్టోబర్ 09 (ఢిల్లీ)
  • మూడో టీ20: అక్టోబర్ 12 (హైదరాబాద్)

తొలి టెస్టుకు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి , కెఎల్ రాహుల్ , సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ , జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాల్.