- 3 వికెట్ల తేడాతో గెలుపు
- చెలరేగిన షకీబ్, నజ్ముల్
- అసలంక సెంచరీ వృథా
న్యూఢిల్లీ : సెమీఫైనల్ రేసు నుంచి వైదొలిగిన రెండు జట్ల మధ్య పోరులో బలమైన శ్రీలంక సింహాలపై బంగ్లాదేశ్ పులులదే పైచేయి అయింది. నజ్ముల్ శాంటో (101 బాల్స్‌లో 12 ఫోర్లతో 90), కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (65 బాల్స్‌లో 12 ఫోర్లతో, 2 సిక్సర్లతో 82) చెలరేగడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 3 వికెట్ల తేడాతో లంకను ఓడించి టోర్నీలో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. పట్టికలో ఏడో ప్లేస్‌కు వచ్చి చాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అయ్యేందుకు ముందంజ వేసింది.
మరోవైపు చరిత్ అసలంక (105 బాల్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 108) సెంచరీతో సత్తా చాటినా బౌలింగ్‌లో ఫెయిలైన లంక ఆరో ఓటమితో ఎనిమిదో ప్లేస్‌కు పడిపోయింది. తొలుత లంక 49.3 ఓవర్లలో 279 రన్స్‌కు ఆలౌటైంది. అసలంక, నిశాంక (41), సమరవిక్రమ (41) రాణించారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ మూడు, షకీబ్, షోరిఫుల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో 41.1 ఓవర్లలోనే 282/7 స్కోరు చేసి గెలిచింది. షకీబ్‌కు ప్లేయర్ ఆఫ్‌ద మ్యాచ్ అవార్డు లభించింది.
అసలంక జోరు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన లంక ఆరో బాల్‌కే ఓపెనర్ కుశాల్ పెరీర (4) వికెట్ కోల్పోగా మరో ఓపెనర్ నిశాంక, కుశాల్ మెండిస్ (19) రెండో వికెట్‌కు 61 రన్స్ జోడించారు. అయితే, ఈ ఇద్దరూ వరుస ఓవర్లలో ఔటవడంతో లంక 72/3తో డీలా పడింది. ఈ దశలో ఫామ్‌లో ఉన్న సదీర సమరవిక్రమతో కలిసి అసలంక ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరూ సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో 18 ఓవర్లకు లంక స్కోరు 100 దాటింది. అయితే, సదీరను షకీబ్ ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 63 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది.
ఆ వెంటనే ఏంజెలో మాథ్యూస్ (0) టైమ్‌డ్ ఔట్ అవడంతో 135 రన్స్‌కే లంక సగం వికెట్లు కోల్పోయింది. అయినా పట్టుదలగా ఆడిన అసలంక.. ధనంజయ డిసిల్వ (34)తో ఆరో వికెట్‌కు 78, మహేశ్ తీక్షణ (21)తో ఏడో వికెట్‌కు 57 రన్స్ జోడించి స్కోరు 250 దాటించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న అతను తంజిమ్ బౌలింగ్‌లో ఎనిమిదో వికెట్‌గా ఔటవగా.. చమీర (4), కాసున్ (0) నిరాశ పరచడంతో మరో మూడు బాల్స్ మిగిలుండగానే లంక ఆలౌటైంది.
బంగ్లా ధనాధన్
లంక పేసర్ మదుషంక స్టార్టింగ్‌లోనే ఓపెనర్లు తంజిద్ (9), లిటన్ (23)ను ఔట్ చేసి బంగ్లాను దెబ్బకొట్టాడు. కానీ, నజ్ముల్ శాంటో, కెప్టెన్ షకీబ్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. నజ్ముల్ స్ట్రయిక్ రొటేట్ చేయగా షకీబ్ వరుస బౌండ్రీలతో లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మూడో వికెట్‌కు 149 బాల్స్‌లోనే 169 రన్స్ జోడించిన వీళ్ల జోరు చూస్తుంటే ఇద్దరూ సెంచరీలు చేయడంతో పాటు మరో వికెట్ కోల్పోకుండానే బంగ్లా టార్గెట్‌ను అందుకునేలా కనిపించింది. ఈ టైమ్‌లో మాథ్యూస్ వరుస ఓవర్లలో శాంటో, షకీబ్‌ను ఔట్ చేయడంతో లంక రేసులోకి వచ్చింది. కానీ, మహ్ముదుల్లా (22), ముష్ఫికర్ (10) వేగంగా ఆడి ఐదో వికెట్‌కు 38 రన్స్ జోడించారు. ఆరు రన్స్ తేడాతో ఈ ఇద్దరూ ఔటైనా తౌహిద్ (15 నాటౌట్), తంజిమ్ (5 నాటౌట్) బంగ్లాను గెలిపించారు.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక : 49.3 ఓవర్లలో 279 ఆలౌట్ (అసలంక 108, నిశాంక 41, తంజిమ్ 3/80).
బంగ్లాదేశ్: 41.1 ఓవర్లలో 282/7 (నజ్ముల్ 90, షకీబ్ 82, మదుషంక 3/69).
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తొలి టైమ్‌డ్ ఔట్
శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి టైమ్‌డ్ ఔట్‌గా లంక వెటరన్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ పెవిలియన్ చేరాడు. షకీబ్ వేసిన 25వ ఓవర్ రెండో బంతికి సమరవిక్రమ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ హెల్మెట్ స్ట్రాప్ ఊడిపోవడంతో మరో హెల్మెట్ తప్పించుకున్నాడు. కొత్తగా క్రీజులోకి వచ్చిన బ్యాటర్ రెండు నిమిషాల్లో బాల్‌ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి. అప్పటికి రెండు నిమిషాలు దాటి పోవడంతో బంగ్లా కెప్టెన్ షకీబ్ టైమ్‌డ్ ఔట్ కోసం అప్పీల్ చేయగా అంపైర్లు ఔటిచ్చారు.
అసహనానికి గురైన మాథ్యూస్ హెల్మెట్ స్ట్రాప్ ఊడిపోయిన విషయం చెబుతూ అంపైర్లు , షకీబ్‌తో వాదనకు దిగాడు. బంగ్లా తన అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటే నాటౌట్ ఇస్తామని అంపైర్లు చెప్పారు. బంగ్లా విత్‌డ్రా చేసుకోకపోవడంతో ఐసీసీ రూల్ 40.1.1 ప్రకారం అంపైర్లు మాథ్యూస్‌ను టైమ్‌డ్ ఔట్‌గా ప్రకటించారు. ఈ ఔట్‌పై మాజీలు పెదవి విరిచారు.