ఢాకా: కలిబంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానంపై కీలక తీర్పు వెల్లడించింది. బంగ్లాదేశ్లో ఘర్షణలు తీవ్ర రూపం దాల్చి 115 మంది ప్రాణాలు కోల్పోవడంతో సుప్రీం కోర్టు విద్యార్థులకు ఊరట గే తీర్పును ఆదివారం నాడు వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ బంగ్లాదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. అయితే.. అలా అని రిజర్వేషన్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయలేదు. 93 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఆందోళనలు చేస్తు్న్న విద్యార్థులకు కచ్చితంగా భారీ ఉపశమనం కలిగించే అంశమే. కేవలం 7 శాతం పోస్టులను మాత్రమే రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేయాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ లో అమల్లో ఉన్న కోటా విధానంలో 56 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వుడే కావడం గమనార్హం. 30 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో (లిబరేషన్ వార్) అసువులు బాసిన వారి కుటుంబ సభ్యులకు కేటాయించారు. 10 శాతం వెనుకబడిన జిల్లాల అభ్యర్థులకు, 10 శాతం మహిళలకు, 5 శాతం మైనార్టీ వర్గాలకు, 1 శాతం దివ్యాంగులకు కేటాయించారు. లిబరేషన్ వార్లో ప్రాణాలర్పించిన వీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై బంగ్లాదేశ్ విద్యార్థి లోకం భగ్గుమంది. అంతేకాకుండా.. ప్రధాని హసీనాకు మద్దతిచ్చే ప్రభుత్వ అనుకూల గ్రూపుల పిల్లలే ఈ పథకం నుంచి లబ్ధి పొందుతున్నారన్న విమర్శలున్నాయి. బంగ్లాదేశ్ లో ప్రతి సంవత్సరం కేవలం 3 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తుంటే, 3 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని విద్యార్థి సంఘాలు చెబుతున్న మాట.
2018లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాపై నిరసనల జ్వాల రేగింది. దీంతో.. షేక్ హసీనా ప్రభుత్వం కోటా విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే.. విముక్తి యుద్ధంలో ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల వారసులు ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో.. షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న కోటా విధాన రద్దు నిర్ణయాన్ని 2024 జూన్లో హైకోర్టు తోసిపుచ్చింది. కోటా విధానం అమల్లో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు అనంతరం బంగ్లాదేశ్లో విద్యార్థులు రోడ్డెక్కారు. నిరసనలు భగ్గుమన్నాయి. ఘర్షణలకు దారితీసి నిరసనలు హింసకు దారితీశాయి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. బస్సులు, రైళ్లను తగలబెట్టారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో షేక్ హసీనా ప్రభుత్వం ఆర్మీ బలగాలను వీధుల్లో మోహరింపజేసింది. ఈ హింసాత్మక ఘటనల్లో 115 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించింది. కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించి కనిపిస్తే కాల్చేయాలని ‘షూట్ ఎట్ సైట్’’ ఆర్డర్ ఇచ్చింది.