బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

ఢాకా : ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అక్కడి సుప్రీం కోర్టు ఆదేశించింది. 93% నియామకాలు మెరిట్ ఆధారంగానే చేపట్టాలని తేల్చి చెప్పింది. మిగిలిన రెండు శాతంలో ఒక శాతం గిరిజనులకు, మరొక శాతం ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని స్పష్టం చేసింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ బంగ్లాదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు వ్యతిరేకించింది.

ఈ మేరకు స్టూడెంట్లు, విద్యార్థి సంఘాల నేతలకు పలు సూచనలు చేసింది. రోడ్లపైకి వచ్చి ఎవరూ నిరసనలు చేపట్టొద్దని, వెంటనే క్లాసులకు అటెండ్ కావాలని సూచించింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో బంగ్లాదేశ్​లో రిజర్వేషన్ల కోటా 56% నుంచి ఏకంగా 7 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇద్దరు స్టూడెంట్లు రిజర్వేషన్‌ కోటాకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌పై బంగ్లాదేశ్‌ సుప్రీం కోర్టు ఆదివారం అత్యవసరంగా విచారణ చేపట్టి ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

కర్ఫ్యూ సడలింపు

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటికే కర్ఫ్యూ అమల్లో ఉంది. తీర్పు తర్వాత అక్కడి హోంమినిస్టర్ కర్ఫ్యూ నుంచి కొంత వెసులుబాటు కల్పించారు. ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు కర్ఫ్యూ సడలించారు. దీంతో అక్కడి ప్రజలు నిత్యావసర సరుకులు కొనేందుకు ఎగబడ్డారు. సోమవారం కూడా అక్కడి ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది.

ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఇప్పటికే దేశవ్యాప్త కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. తాజాగా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసింది. బంగ్లా ప్రజలకు ప్రధాని షేక్ హసీనా క్షమాపణ చెప్పాలంటూ విద్యార్థులు, ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్​పీ) డిమాండ్ చేస్తున్నది. హింస కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అల్లరతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్తున్నది. కాగా, సుప్రీం కోర్టు తాజా తీర్పుపై పలువురు స్టూడెంట్లు, విద్యార్థి సంఘ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బంగ్లా బార్డర్ వెంట బీఎస్ఎఫ్ అలర్ట్

దేశంలో హింస నేపథ్యంలో సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు వెంట అలర్ట్​గా ఉన్నామని చెప్పారు. పెట్రోలింగ్ పెంచడంతో పాటు బార్డర్ సీజ్ చేశామన్నారు. హింసను ఆసరా చేసుకుని ఎవరూ అడ్వాంటేజ్ తీసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వివరించారు.

బార్డర్ వెంట భారీగా బలగాలను మోహరించినట్టు తెలిపారు. తిరిగి స్వస్థలాలకు వెళ్లేందుకు ఇండియన్స్ స్టూడెంట్లు బార్డర్​కు వస్తున్నారన్నారు. త్రిపుర మీదుగా ఇండియాకు వెళ్తున్నారన్నారు. ఆదివారం 314 మంది బార్డర్ దాటారు. వీరిలో 66 మంది నేపాలీ స్టూడెంట్లు కూడా ఉన్నారు. ఇప్పటి దాకా 693 మంది స్టూడెంట్లు బార్డర్ దాటారు.