మిర్పూర్: న్యూజిలాండ్‌తో బుధవారం మొదలైన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ తొలి రోజే పట్టు బిగించింది. బౌలర్లు మెహిదీ హసన్ మిరాజ్ (3/17), తైజుల్ ఇస్లామ్ (2/29) చెలరేగడంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 12.4 ఓవర్లలో 55/5 స్కోరు చేసింది. డారిల్ మిచెల్ (12 బ్యాటింగ్), గ్లెన్ ఫిలిప్స్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లాథమ్ (4), కాన్వే (11), విలియమ్సన్ (13), నికోల్స్ (1), టామ్ బ్లండెల్ (0) నిరాశపర్చారు.
అంతకుముందు టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 66.2 ఓవర్లలో 172 రన్స్‌కు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (35), షహాదత్ హుస్సేన్ (31), మెహిదీ హసన్ మిరాజ్ (20) రాణించారు. కివీస్ బౌలర్లలో శాంట్నర్, ఫిలిప్స్ చెరో మూడు వికెట్లు తీశారు. ప్రస్తుతం న్యూజిలాండ్ ఇంకా 117 రన్స్ వెనకబడి ఉంది.
బాల్‌ను చేతితో అడ్డుకుని..
ఈ మ్యాచ్‌లో ముష్ఫికర్ బాల్‌ను చేతితో అడ్డుకుని ఔట్ కావడం చర్చనీయాంశమైంది. ఇన్నింగ్స్ 41వ ఓవర్‌లో జెమీసన్ వేసిన బాల్‌ను ముష్ఫికర్ డిఫెండ్ చేశాడు. కానీ బాల్ బౌన్స్ అయి వికెట్ల మీదకు వస్తుండటంతో దాన్ని కుడి చేతితో అడ్డుకున్నాడు. కివీస్ ప్లేయర్లు ఫిర్యాదు చేయడంతో ఫీల్డ్ అంపైర్లు.. టీవీ అంపైర్‌కు నివేదించారు.
ముష్ఫికర్ బాల్‌ను చేతితో అడ్డుకున్నట్లు రీప్లేలో స్పష్టంగా తేలడంతో ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ రూల్ ప్రకారం అతన్ని ఔట్‌గా ప్రకటించారు. బంగ్లా తరఫున ఇలా ఔటైన తొలి బ్యాటర్‌గా, టెస్ట్ క్రికెట్ హిస్టరీలో 11వ ప్లేయర్‌గా ముష్ఫికర్ రికార్డులకెక్కాడు. చివరగా 2001లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో మైకేల్ వాన్ (ఇంగ్లండ్) ఇలా ఔటయ్యాడు.