గెలిచే సత్తా మాకే ఉంది.. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ మాదే..: బంగ్లాదేశ్ కెప్టెన్

గెలిచే సత్తా మాకే ఉంది.. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ మాదే..: బంగ్లాదేశ్ కెప్టెన్

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలు పంపాడు. తమ జట్టును తేలిగ్గా తీసుకోవద్దని.. కుర్రాళ్లు మంచి ఊపు మీదున్నారని అగ్రశ్రేణి జట్లను ఉద్దేశించి మాట్లాడాడు. ఛాంపియన్లుగా నిలిచి, ట్రోఫీతో బంగ్లా గడ్డపై కాలుపెట్టే సమయం వచ్చిందని ప్రగల్భాలు పలికాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి బయదేరే ముందు జరిగిన విలేకరుల సమావేశంలో శాంటో ఈ వ్యాఖ్యలు చేశాడు. 

"ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లు బలమైనవే. ఛాంపియన్లుగా నిలిచేందుకు అన్ని జట్లకు అర్హత ఉంది. కాకపోతే, మునుపటి టోర్నీలతో పోలిస్తే, మేం మరింత బలంగా ఉన్నాం. గతంలో మాకు నాణ్యమైన పేస్ బౌలర్లు లేరు, కానీ ఇప్పుడు బలమైన పేస్ బౌలింగ్ యూనిట్ ఉంది. ఇక మణికట్టు స్పిన్నర్లకు, ఆల్‌రౌండర్లకు జట్టులో కొదవ లేదు.."

ALSO READ | ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్.. కప్పు కొట్టినట్టేనా..? ఇతనే ఎందుకంటే..

"జట్టులోని ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అగ్రశ్రేణి జట్లను ఓడించగలమని నమ్ముతున్నారు. కానీ, మా విధిరాత ఎలా ఉందో.. అల్లా ఏమి రాశారో మాకు తెలియదు. కష్టపడతాం, విజేతలుగా నిలవడానికి మా వంతు కృషి చేస్తాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్లుగా లక్ష్యాన్ని చేరుకుంటాం.." అని శాంటో అన్నారు.

రెండే విజయాలు

ఇటువంటి మాటలు బంగ్లా కెప్టెన్‌కు కొత్తేమీ కాదు. రెండేళ్ల క్రితం భారత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు ఇలాంటి ప్రగల్భాలే పలికాడు. తీరా చూస్తే రెండే రెండు విజయాలతో లీగ్ దశని ముగించారు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ జట్టు.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలవ్వడం గమనార్హం.