బంగ్లాదేశ్ లో రెండు రైళ్లు ఢీకొన్నాయి : 20 మంది మృతి, 100 మందికి గాయాలు

బంగ్లాదేశ్ దేశంలో ఘోర రైలు ప్రమాదం. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 20 మంది చనిపోయారు. 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన 2023, అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలో.. ఖైరబ్ అనే ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. కిషోర్ గంజ్ అనే రైల్వేస్టేషన్ దగ్గర.. గూడ్స్ రైలును.. ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొన్నది. వేగంగా ఢీకొనటంతో.. నాలుగు బోగీలు పట్టాలు తప్పి పల్టీలు కొట్టాయి.

ఢాకా వెళుతున్న గోథూలీ ఎక్స్ ప్రెస్.. గూడ్స్ రైలును ఢీకొన్నట్లు స్థానిక రైల్వే అధికారులు చెబుతున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది... ఎదురెదురుగా ఢీకొన్నాయా.. గూడ్స్ రైలును వెనక నుంచి ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొన్నదా అనే విషయంలో ఇంకా స్పష్టం ఇవ్వటం లేదు అధికారులు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని.. మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చని ప్రకటించారు అధికారులు. కొన్ని బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయని.. అందులో చాలా మంది చిక్కుకున్నారని.. సహాయక చర్యలు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు అధికారులు. 

ALSO READ :- దేవర.. పవర్ఫుల్ పోస్టర్ వచ్చేసింది

రైళ్లు ఢీకొన్న తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా చాలా రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. గాయపడిన వంద మందిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు అధికారులు. ప్రమాద స్థలానికి అత్యవసర సర్వీసులు వచ్చాయని.. స్థానిక ప్రజల సహకారంతో వేగంగా సహాయ చర్యలు జరుగుతున్నట్లు వెల్లడించారు బంగ్లాదేశ్ రైల్వే అధికారులు. విచారణ తర్వాత ప్రమాదానికి కారణాలను వెల్లడిస్తామంటున్న అక్కడి ప్రభుత్వం.. రైలులోని మిగతా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చటానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.