పొట్టి ప్రపంచకప్ టైటిల్ తమదేనంటూ అమెరికాలో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ఏమైందో అందరికీ విదితమే. చివరకూ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న అగ్రదేశం(యూఎస్ఏ) చేతిలోనూ ఓడి లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. తన చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పైనా కష్టంగానే గెలిచింది. ఎంతో పూర్వవైభవం ఉన్న పాకిస్థాన్ జట్టు.. ఇలా పాతాళానికి పడిపోవడాన్ని ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
పాకిస్థాన్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
2024 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడం పట్ల దిగ్గజ బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తన బాధను వ్యక్తం చేశాడు. తదుపరి టోర్నీల్లో పాకిస్థాన్ జట్టు మెరుగైన ఫలితాలు రాబట్టాలని ఆకాంక్షించాడు. ప్రస్తుత జట్టుకు వారి పోరాటాల్లో మార్గనిర్దేశం చేయాలని మాజీ కెప్టెన్, ఆల్ టైమ్ గ్రేట్ షాహిద్ అఫ్రిదీకి సలహా ఇచ్చాడు. పాక్ జట్టు ప్రపంచ కప్ ఎలిమినేషన్ అనంతరం తమీమ్ ఇక్బాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా 'మెన్ ఇన్ గ్రీన్'ను ఓదార్చాడు.
Feel sad to see Pakistan get eliminated from T20 WC. Hope they come well next time and have seniors like @SAfridiOfficial to show the way.
— Tamim Iqbal Khan (@TamimOfficial28) June 16, 2024
అమెరికా చేతిలో ఓటమి
టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ ఎలిమినేషన్‌కు ప్రధాన కారణం.. అమెరికా చేతిలో ఓటమి పాలవ్వడం. అగ్రదేశం విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు కావాల్సివున్నా.. పాక్ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. అదే మ్యాచ్‌లో సూపర్ ఓవర్ రూపంలో మరో అవకాశం వచ్చినా.. దానిని చేజార్చుకున్నారు. అనంతరం భారత్ పై స్వల్ప(120 టార్గెట్) లక్ష్యాన్ని చేధించలేకపోయారు. ఆపై పుంజుకొని కెనడాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించినా.. ఇతర జట్ల పలితాలు వారిని దెబ్బతీశాయి. జూన్ 14న అమెరికా-ఐర్లాండ్‌పై మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం కావడంతో పాకిస్తాన్ ముందుగానే నిష్క్రమించింది.