ఇండియా vs బంగ్లా మ్యాచ్: నరాలు తెగే ఉత్కంఠ.. చివరకు టై

ఇండియా vs బంగ్లా మ్యాచ్: నరాలు తెగే ఉత్కంఠ.. చివరకు టై

ఇండియన్ ఉమెన్, బంగ్లాదేశ్ ఉమెన్ జట్ల మధ్య జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్ అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను పంచింది. ఆఖరివరకు నువ్వా.. నేనా అన్నట్లు సాగిన మూడో వన్డే చివరకు టైగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 225 పరుగులు చేయగా.. భారత మహిళా జట్టు సరిగ్గా 225 పరుగుల వద్దే ఆలౌట్ అయ్యింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లా బ్యాటర్లు.. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. దీంతో బంగ్లాదేశ్ మహిళా జట్టు నిర్ణీత ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.  ఆ జట్టు ఓపెనర్ ఫర్గానా హక్(107) సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ షమీమా సుల్తానా(52) హాఫ్ సెంచరీ చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీసుకోగా.. దేవికా వైద్య ఒక వికెట్ పడగొట్టింది. 

అనంతరం 226 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత జట్టు.. విజయం చివరి అంచు వరకు వచ్చి ఓటమిపాలైంది. 49.3 ఓవర్లలో 225 పరుగుల వద్ద ఆలౌటైంది. విజయానికి ఒక పరుగ కావాల్సి ఉన్న సమయంలో చివరి వికెట్ కోల్పోవటం గమనార్హం. విజయం కోసం జెమీమా రోడ్రిగ్స్ కడవరకూ పోరాడినా.. ఆమెకు మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు.

బంగ్లా పర్యటనలో మూడు మ్యాచుల టీ20 సిరీస్‪ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా, వన్డేల సిరీస్‌ను మాత్రం 1-1తో సరిపట్టుకుంది.