WI vs BAN, 2nd Test: పులిలా గర్జించిన బంగ్లాదేశ్.. 15 ఏళ్ళ తర్వాత వెస్టిండీస్‌పై టెస్ట్ విజయం

WI vs BAN, 2nd Test: పులిలా గర్జించిన బంగ్లాదేశ్.. 15 ఏళ్ళ తర్వాత వెస్టిండీస్‌పై టెస్ట్ విజయం

వెస్టిండీస్ తో ముగిసిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ అద్భుతం చేసింది. ఓడిపోయే టెస్ట్ మ్యాచ్ లో గెలిచి ఔరా అనిపించింది. తొలి ఇన్నింగ్స్ లో 164 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు ఆ తర్వాత కోలుకొని కంబ్యాక్ ఇచ్చిన విధానాన్ని ప్రశంసించాల్సిందే. నాలుగో రోజు బంగ్లాదేశ్ నిర్ధేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో ఆతిధ్య వెస్టిండీస్ జట్టు 185 పరుగులకే ఆలౌటైంది. దీంతో 101 పరుగుల భారీ విజయాన్ని బంగ్లాదేశ్ నమోదు చేసింది. 

తైజుల్ ఇస్లాం 5 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. హసన్ మహమ్మద్, టస్కిన్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. నహిద్ రానాకు ఒక వికెట్ దక్కింది. విండీస్ ఆటగాళ్లలో కావెం హాడ్జ్(55) హాఫ్ సెంచరీ చేసి పోరాడినా మిగిలిన వారు విఫలమయ్యారు. ఈ మ్యాచ్ విజయంతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 1-1 తో ఇరు జట్లు సమంగా ముగించాయి. తైజుల్ ఇస్లాంకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.     

వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ 15 ఏళ్ల తర్వాత తొలిసారి టెస్టు గెలుచుకోవడం విశేషం. బంగ్లాదేశ్‌ కరేబియన్‌ గడ్డపై ఆడిన తమ చివరి ఏడు టెస్టుల్లో ఓడిపోయారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 164 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వెస్టిండీస్ 146 పరుగులకే పరిమితమైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాకు 18 పరుగుల స్వల్ప లక్ష్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 268 పరుగులకు ఆలౌట్ కాగా.. 287 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో వెస్టిండీస్ జట్టు 185 పరుగులకే ఆలౌటైంది.