Cricket World Cup 2023: బంగ్లా బోణీ అదుర్స్: ఒక్క రోజే ఆఫ్ఘనిస్తాన్ కి రెండు పరాజయాలు

Cricket World Cup 2023: బంగ్లా బోణీ అదుర్స్: ఒక్క రోజే ఆఫ్ఘనిస్తాన్ కి రెండు పరాజయాలు

వరల్డ్ కప్ లో సంచనాలు సృష్టించడానికి భారత గడ్డపై అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి తొలి మ్యాచులోనే ఎదరు దెబ్బ తగిలింది. తమదైన రోజున పెద్ద జట్లకు సైతం షాక్ ఇచ్చే ఆఫ్గాన్ టీం బంగ్లాదేశ్ చేతిలో చిత్తయింది. మరోవైపు ఆసియా క్రీడల్లో కూడా భారత్ చేతిలో ఫైనల్లో ఓడిపోయి సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుంది. ఇక ఈ మ్యాచులో సమిష్టిగా రాణించిన బంగ్లాదేశ్ బోణీ కొట్టి తమను తక్కువగా అంచనా వేస్తే ఓటమి తప్పదని పెద్ద జట్లకు సంకేతాలను పంపింది.   

         
టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలి 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 83 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే ఆ తర్వాత  73 పరుగులకే చివరి 9 వికెట్లను కోల్పోయి 156 పరుగులతో సరిపెట్టుకుంది. బంగ్లా స్పిన్నర్లు షకీబ్, మెహదీ హాసన్ మిరాజ్ ధాటికి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. గుర్బాజ్ 47 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో షకీబ్, మెహదీ హాసన్ మిరాజ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. షోరీఫుల్ ఇస్లాం కి రెండు వికెట్లు దక్కాయి. 

ఇక లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయినా.. నజీముల్ శాంటో(59), మెహదీ హాసన్(57) మిరాజ్ భారీ భాగస్వామ్యంతో మ్యాచ్ బంగ్లాదేశ్ వైపుకి తిప్పారు. దీంతో 157 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 34.4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ విజయాన్ని అందుకుంది. మొత్తానికి ఇటు వరల్డ్ కప్ లో అటు ఆసియా క్రీడల్లో ఆఫ్ఘనిస్తాన్ టీంకి పరాజయాలే పలకరించాయి.