సిల్హెట్ : లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (10/184) రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి పది వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్‌తో శనివారం ముగిసిన తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ 150 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 1–0 లీడ్‌లో నిలిచింది. 332 రన్స్ ఛేజింగ్‌లో 113/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 71.1 ఓవర్లలో 181 రన్స్‌కు ఆలౌటైంది.
డారిల్ మిచెల్ (58), టిమ్ సౌథీ (34), ఇష్ సోధీ (22) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన తైజుల్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో కివీస్ ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టాడు. ఆఫ్ స్పిన్నర్ నయీమ్ హసన్ 2, షోరిఫుల్ ఇస్లామ్, మెహిదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ తీశారు. తైజుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన రెండో టెస్ట్ ఈ నెల 6 నుంచి మీర్పూర్‌లో జరుగుతుంది.