
ఘట్కేసర్, వెలుగు: పహల్గాం ఉగ్రదాడి తర్వాత గ్రేటర్‌పరిధిలో అక్రమంగా ఉంటున్న విదేశీయుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారంలో నకిలీ పాత్రలతో నివాసం ఉంటున్న బంగ్లాదేశీయుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సీఐ రాజువర్మ వివరాల ప్రకారం.. పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడలో ఓ విదేశీయుడు అక్రమంగా నివాసం ఉన్నట్లు విశ్వాసనీయ సమాచారం అందింది.
దీంతో వెంకటసాయి ప్రేమ్‌నగర్ కాలనీలోని ప్లాట్ నంబర్36లో షేక్ రషెల్ అలియాస్ ఎండీ రషెల్(31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు నకిలీ ఆధార్, పాన్, ఓటర్ ఐడీ కార్డులతో వెస్ట్ బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా స్థానికంగా చలామణీ అవుతూ.. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇంట్లో సోదా చేయగా, బంగ్లాదేశ్‌కు చెందిన అతని గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయి. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి, రెండు ఫోన్లు, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.