![మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో బంగ్లా మహిళా క్రికెటర్‌పై ఐదేండ్ల బ్యాన్](https://static.v6velugu.com/uploads/2025/02/bangladeshi-female-cricketer-banned-for-five-years-in-match-fixing-case_J0K62B9lba.jpg)
దుబాయ్ : సౌతాఫ్రికా వేదికగా 2023లో జరిగిన విమెన్స్ టీ20 వరల్డ్ కప్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నించిన కేసులో దోషిగా తేలిన బంగ్లాదేశ్ మహిళా షోహెలీ అఖ్తర్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఐదేండ్ల నిషేధం విధించింది. దాంతో అవినీతి ఆరోపణలతో ఐసీసీ బ్యాన్ ఎదుర్కొన్న తొలి మహిళా క్రికెటర్‌గా 36 ఏండ్ల షోహెలీ రికార్డుకెక్కింది. ఆఫ్‌స్పిన్ బౌలర్ అయిన షోహెలీ చివరగా 2022లో బంగ్లాకు ప్రాతినిధ్యం వహించింది.
గత టీ20 వరల్డ్ కప్ సమయంలో బంగ్లాదేశ్– ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందు షోహెలీ ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా తన ఫ్రెండ్, బంగ్లా టీమ్ క్రికెటర్‌ను సంప్రదించి మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని కోరినట్టు దర్యాప్తులో తేలింది. ఆసీస్ మ్యాచ్ టైమ్‌లో తన కజిన్ ఫోన్‌లో బెట్టింగ్ చేయగానే హిట్ వికెట్‌గా ఔటవ్వాలని సదరు క్రికెటర్‌ను కోరింది. ఇందుకు ఒప్పుకుంటే 2 మిలియన్ బంగ్లాదేశ్ టాకాలు ఇస్తానని ఆఫర్ ఇచ్చింది.
అయితే, షోహెలీ ఆఫర్‌ను తిరస్కరించిన సదరు బంగ్లా క్రికెటర్.. ఐసీసీ యాంటీ కరప్షన్ (ఏసీయూ) ఏసీయూకి సమాచారం ఇచ్చింది. దీనిపై దర్యాప్తు చేసిన ఐసీసీ షోహోలీ తప్పు ఒప్పుకోవడంతో ఆమెపై నిషేధం వేటు వేసింది.