బంగ్లాదేశీల ఇంటిబాట

పశ్చిమ బెంగాల్​, అస్సాం, త్రిపురతోపాటు ఇతర రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాలుగా ఉంటున్న బంగ్లాదేశీలు ఈమధ్య ఇంటిబాట పడుతున్నారు. గతంలో అడ్డదారుల్లో ఇక్కడికి వచ్చినట్లే … ఇప్పుడు చిన్నగా అవతలికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ బీఎస్​ఎఫ్​కి దొరికిపోతున్నారు. ఇంతకీ వాళ్లు సొంత దేశం ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? ఇల్లీగల్​గా వచ్చారు కాబట్టి. ఎన్నార్సీ, సీఏఏల వల్ల తమకు ఇక ఇండియా సిటిజెన్​షిప్​ రాదనే విషయం అర్థమై ఈ నిర్ణయం తీసుకుంటున్నారా? మరేదైనా కారణం ఉందా?

కొత్త చట్టాలు రావడంతో మన దేశంలో చాలా మంది బంగ్లాదేశీలు మూట ముల్లె సర్దుకుంటున్నారు. నేషనల్​ రిజిస్టర్​ ఆఫ్​ సిటిజన్స్ ​(ఎన్నార్సీ), సిటిజెన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్ (సీఏఏ)లను చూసి ఉలిక్కి పడుతున్నారు. ఈ రెండు వడపోతల నుంచి తప్పించుకోవటం అసాధ్యమని తెలుసుకుంటున్నారు. చేసేదేమీ లేకపోవటంతో… ఆలస్యం చేయటం కూడా అనవసరం అనుకుంటున్నారు. వెళ్లక తప్పదని తెలిసినప్పుడు ముందే బయలుదేరటం మంచిదంటారు కదా. వాళ్లూ అదే చేస్తున్నారు.

మూటా ముల్లె సర్దుకొని స్వదేశానికి పయనమవుతున్నారు. అయితే.. ఇలా ఇష్టం వచ్చినప్పుడు ఇండియా వచ్చి, కష్టం అనుకున్నప్పుడు జారుకుందామంటే కుదరదు కదా. బంగ్లాదేశ్​ నుంచి ఇక్కడి ఎలా వచ్చారో, ఇన్నాళ్లూ ఎక్కడున్నారో, ఏం చేశారో చెప్పాల్సి ఉంటుంది. అందుకే వాళ్లను బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​ (బీఎస్​ఎఫ్​) అరెస్ట్​ చేస్తోంది. ఇప్పటిదాక వాళ్లు చేసిన ఇల్లీగల్​ పనులపై ఆరా తీస్తోంది. బంగ్లాదేశీల గోబ్యాక్​ ప్రయత్నాలు కొన్ని నెలలుగా కొనసాగుతున్నాయని బీఎస్​ఎఫ్​ చెబుతోంది.

అనుకునేదొకటి.. అవుతోంది మరొకటి..

గతంలో ఏదో ఒక విధంగా బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​ (బీఎస్​ఎఫ్​) కంట పడకుండా వచ్చారు. అదే తరహాలో పారిపోవాలని ప్రయత్నిస్తే అన్ని సార్లూ అనుకున్నట్లే జరగదు. ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు గస్తీ బాగా పెరిగింది. దీనికితోడు అస్సాంలో ఎన్నార్సీ ఫైనల్​ లిస్టును 4 నెలల కిందటే రిలీజ్​ చేశారు. రీసెంట్​గా సీఏఏ కూడా అమల్లోకి వచ్చేసింది. దీంతో మన దేశంలో ఇన్ని రోజులూ రూల్స్​కి వ్యతిరేకంగా, సైలెంట్​గా, సీక్రెట్​గా ఉంటున్నవాళ్లు ఇప్పుడు ఎలాగోలా బయటపడాలని చూస్తున్నారని బీఎస్​ఎఫ్​ భావిస్తోంది.

సీఏఏ వల్ల బంగ్లాదేశ్​ నుంచి భారీఎత్తున జనం వస్తారని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భయపడుతున్నారు. ముస్లింలు తప్ప మిగతా ఆరు మతాలవాళ్లు సిటిజెన్​షిప్​పై​ ఆశతో మన దేశంలోకి బారులు తీరతారని ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. చట్టవిరుద్ధం​గా ఇండియాకి వచ్చిన బంగ్లాదేశీలు తిరుగుముఖం పడుతున్నారు. దీనిపై ఆ దేశ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ఇష్యూపై బోర్డర్​ గార్డ్స్​ బంగ్లాదేశ్(బీజీబీ) నుంచి మనకి ఇంకా అధికారికంగా సమాచారం రాలేదు. ​

అస్సాం, త్రిపుర మీదుగా..

మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న బంగ్లాదేశీలు తమ దేశానికి వెళ్లేందుకు అస్సాం, త్రిపురలను అనుకూల ప్రాంతాలుగా భావిస్తున్నారు. జాతుల పరంగా చూస్తే ఆ రెండు రాష్ట్రాల జనాలు బంగ్లాదేశీల్లాగే కనిపిస్తారు. అదే వాళ్లకు ప్లస్​ పాయింట్​గా మారుతోందని బీఎస్​ఎఫ్ ​(మేఘాలయ ఫ్రాంటియర్​) ఇన్​స్పెక్టర్​ జనరల్​ కుల్దీప్​ సైనీ అన్నారు. బంగ్లాదేశ్ ఆర్థికంగా పుంజుకోవటంతో అక్కడి నుంచి చొరబాట్లు తగ్గాయని, ఇండియాలో తలదాచుకుంటున్నవాళ్లు కూడా స్వదేశాలకు వెళ్లడంపై ఫోకస్ పెడుతున్నారని చెప్పారు.

125 బోర్డర్​ ఔట్​పోస్టులు

ఇండియా, బంగ్లాదేశ్​ మధ్య 443 కిలోమీటర్ల పొడవున ఉన్న సరిహద్దు వెంట బీఎస్​ఎఫ్(మేఘాలయ విభాగం) కాపలా కాస్తోంది. ఈ బోర్డర్​లో 125 ఔట్​పోస్టులను ఏర్పాటుచేశారు. ఇంకా 100 కిలోమీటర్ల పొడవున ఫెన్సింగ్​ వేయాల్సి ఉంది. సీఏఏ నేపథ్యంలో రక్షణకు సంబంధించి హోం మినిస్ట్రీ నుంచి గానీ,  ఎక్స్​టర్నల్​ అఫైర్స్​ మినిస్ట్రీ నుంచి గానీ కొత్త ఆదేశాలేవీ రాలేదని కుల్దీప్​ సైనీ స్పష్టం చేశారు. ఈ చట్టం అమల్లోకి వచ్చాక జనరల్​ రూల్​ ఆఫ్​ గార్డింగ్​లో ఎలాంటి మార్పులూ చేయలేదని వివరించారు.

వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి