![బంగ్లాదేశ్లో ఆపరేషన్ డెవిల్ హంట్..ఆమె మద్దతుదారులే టార్గెట్?](https://static.v6velugu.com/uploads/2025/02/bangladeshs-devil-hunt-to-tackle-violence-1300-arrested-in-sweeping-crackdown_zIGHFJX1mP.jpg)
- హసీనా మద్దతుదారులపై బంగ్లా సర్కారు ఉక్కుపాదం
- ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ పేరుతో 1,308 మంది అరెస్టు
- దుష్టశక్తులపై ఆపరేషన్ కొనసాగుతుందన్న ప్రభుత్వం
ఢాకా: మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులు, అవామీ లీగ్ పార్టీ నేతలు, కార్యకర్తలపై మొహమ్మద్ యూనస్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. విద్యార్థి సంఘం కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారంటూ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,308 మందిని ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ పేరుతో భద్రతా బలగాలు అరెస్టు చేశాయి.
మూకదాడులు, విధ్వంసాలు జరగకుండా అడ్డుకునేందుకు ముందుజాగ్రత్త చర్యగా వారిని అరెస్టు చేశామని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. మెట్రోపాలిటన్ ఏరియాల్లో 274 మందిని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో 1,034 మందిని అరెస్టు చేశామని వెల్లడించారని బంగ్లాదేశ్ మీడియా తెలిపింది. అరెస్టయిన వారంతా అవామీ లీగ్ పార్టీ, దాని అనుబంధ సంస్థలకు చెందిన వారేనని మీడియా పేర్కొంది.
ఏంటీ ఆపరేషన్ డెవిల్ హంట్?
అవామీ లీగ్ పార్టీకి చెందిన చిహ్నాలు, సైన్ బోర్డులను ధ్వంసం చేసేందుకు గాజీపూర్ సిటీలోని దక్షిణ్ఖాన్ ప్రాంతంలో ఈనెల 7న రాత్రి ఓ అల్లరిమూక బయలుదేరింది.
ఈ క్రమంలో అవామీ లీగ్ గుర్తులు, బోర్డులను మూక ధ్వంసం చేసింది. అలాగే, మాజీ మంత్రి మొజమ్మిల్ హక్ నివాసంపైనా గుంపు దాడికి పాల్పడుతుండగా అవామీ లీగ్ సపోర్టర్లు అక్కడికి చేరుకుని దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య హింస జరిగింది. అల్లరిమూకకు చెందిన 14 మంది గాయపడ్డారు. ఈ దాడిచేసిన వారిని పట్టుకునేందుకు యూనస్ సర్కారు ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ ను ప్రారంభించింది. అశాంతిని సృష్టించే ప్రయత్నం చేసే వారందరినీ పట్టుకుని శిక్షిస్తామని, అప్పటి వరకు ఈ ఆపరేషన్ కొనసాగు తుందని పేర్కొంది.