- లోపల సీఎం రేవంత్ఉన్న టైమ్‌లో ఇంట్లోకి చొరబడేందుకు యత్నం
- బాల్క సుమన్ సహా12 మంది అరెస్ట్
హైదరాబాద్/జూబ్లీహిల్స్, వెలుగు: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించారని కేసు నమోదు చేశారు.
సీఎం ఉన్న సమయంలోనే హంగామా సృష్టించిన సుమన్‌తో పాటు ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్స్పోక్స్పర్సన్ కే వాసుదేవరెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ఆంజనేయగౌడ్, కడారి స్వామి యాదవ్, తుంగబాలు, డీ రాజు, కే జంగయ్య, వరికుప్పల వాసు, చత్తారి దశరథ్, దూదిమెట్ల బాలరాజ్యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్‌లోటెస్టులు చేసిన అనంతరం, వారిని కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు కండిషన్బెయిల్ మంజూరు చేసింది.
కాంగ్రెస్‌లో చేరుతున్నామని చెప్పి చొరబాటు
పోచారంను పార్టీలోకి ఆహ్వానించేందుకు శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ ఎమ్మెల్యేలు ఆయన ఇంటికి వచ్చారు.ఈ విషయం ముందుగానే తెలుసుకున్న బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా 12 మంది అక్కడికి చేరుకున్నారు. తామంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామంటూ అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు చెప్పారు. పోలీసులు ఇది నిజమని నమ్మి లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. పోచారంకు రేవంత్‌రెడ్డి కండువా కప్పుతున్న సమయంలో బాల్క సుమన్ నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ నేతలు ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
భద్రతా వైఫల్యంపై సీరియస్
సీఎం ఉన్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకోవడంలో భద్రతా వైఫల్యం ఉన్నట్లు గుర్తించారు. సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గుమ్మి చక్రవర్తి, వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్ అక్కడకు చేరుకొన్నారు. విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి, వివరాలు సేకరించారు. వీడియోలను పరిశీలించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.