బంజారాల బతుకమ్మ తీజ్

బంజారాల బతుకమ్మ తీజ్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గిరిజన తండాలలో, గూడాలలో, బంజారా కాలనీలో లంబాడీల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ప్రకృతిని ఆరాధిస్తూ గొప్పగా పూజించే తీజ్ పండుగ ఉత్సవాలు.  ఆధునిక ప్రపంచంలోని కాలం మారుతున్న కొద్దీ తమ గిరిజన లంబాడీల సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి ఏటా తీజ్ పండుగను  అత్యంత వైభవంగా లంబాడీలు జరుపుకుంటున్నారు. గిరిజన పండుగలన్నీ ప్రకృతిని ఆరాధించేవే.  కఠోర నియమాలు, డప్పుల మోత, కేరింతలు, ఊరేగింపులు, ఆటపాటలు, అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్లు, అనుబంధాలు బావ మరదలు అల్లరి చేష్టలు, భక్తిశ్రద్ధలతో  వీటన్నిటిని మేళవింపుతో తొమ్మిది రోజుల పాటు సంబరాలతో పాటు పెళ్లి కానీ లంబాడీ యువతులు జరుపుకునేది  తీజ్ పండుగ అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రతి గిరిజన తండాలో  తీజ్ పండుగ వేడుకలతో కళకళలాడుతున్నది. ఈ తీజ్ పండుగ బతుకమ్మను పోలి  ఉంటుంది. గోధుమ మొలకలను ఎనిమిది రోజుల పాటు పూజించి తొమ్మిదవ రోజు తండా ప్రజలందరూ కలిసి ఊరేగింపుతో నిమజ్జనం చేస్తారు. వర్షాకాలం ప్రారంభంలోనే  పత్తి చేనులో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్’ అని అంటారు. గోధుమ మొలకలను కూడా ‘తీజ్’ గా అని పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే తీజ్  లో గోధుమ మొలకలను పూజించడం గిరిజన లంబాడీల  సంప్రదాయ ఆనవాయితీ.

నాట్లు ముగిశాక..    

నాట్లు పూర్తయిన తరువాత  తొమ్మిది రోజుల పాటు తీజ్ ఉత్సవాలు జరుపుతారు. ఆడపిల్లలంతా కలిసి తండాల్లోని ప్రతి ఇల్లిల్లు  తిరిగి పెద్ద వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటారు. తండా పెద్దమనిషి ‘నాయక్’ అనుమతి తీసుకొని తీజ్​ పండుగ మొదలుపెడతారు.  ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరిస్తారు.  అనంతరం ఆడపిల్లలు అంగడికి వెళ్లి గోధుమలు, శనగలు, ఇతరత్రా సామాన్లు తెచ్చుకుంటారు. నానబెట్టిన మొలకలు వాటిని మొలకెత్తించడానికి దూసేరు తీగలతో అల్లిన బుట్ట ( ఓల్డి) లను తెచ్చుకుంటారు. నానబెట్టిన గోధుమలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. పుట్ట మట్టిని తెచ్చి అందులో మేక ఎరువును కలుపుతారు‌‌. లంబాడీల దేవతలు దండి యాడి,  తుల్జా భవాని, సేవాభాయ, సేవాలాల్ మహారాజ్, సీత్లా భవాని, పేర్లతో తయారు చేసిన బుట్టలలో మొదటగా తండా పెద్దమనిషి నాయక్ చేత ఎరువు కలిపిన మట్టిని బుట్టలో పోయిస్తారు. ఆ తరువాత నానబెట్టిన గోధుమలు బుట్టలో చల్లిస్తారు.  ఒక్కొక్క ఆడపిల్ల ఒక్కొక్క బుట్ట పెడతారు. ఈ బుట్టలన్నీ ఒకే చోట ఉండేందుకు తండా పెద్దమనిషి  నాయక్ ఇంటి ముందు పందిరిని ఏర్పాటు వేస్తారు.  ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజూ మూడు పూటలు పందిరిపై పెట్టిన బుట్టలలో బాయి నీళ్లు పోయాల్సి ఉంటుంది.

పెళ్లి కాని యువతులకు పండుగ 

బంజారాల సంప్రదాయం ప్రకారం వివాహం కాని అమ్మాయిలు తండాలో ఎంత మంది ఉంటే అంతమంది తమ బుట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిపై ఉంచుతారు. యువతుల్లో ఒకరు తమ బృందానికి నాయకురాలిగా వ్యవహరిస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో మూడు పూటలు నీరు పోస్తారు. ఈ నీరు అత్యంత పవిత్రమైందని, దీనివల్ల శుభం జరుగుతుందని నమ్మకం.  నానబెట్టిన రేగుముళ్లను గుచ్చి ఒక విలక్షణమైన ఆచారాన్ని పాటిస్తారు.  పెళ్లి కాని ఆడపిల్లలు రేగు ముళ్లకు శనగలు గుచ్చేటప్పుడు తమకు బావ వరుస అయిన వారు ముళ్లను కదిలిస్తారు. అయినా సహనంతో ఆడపిల్లలు శనగల్ని ముళ్లకు గుచ్చాల్సిందే.  చెల్లెల్ని ఏడిపించే అన్నలను కూడా ఈ కార్యక్రమంలో మనం చూడవచ్చు. తీజ్ కోసం నీళ్లను తెచ్చే సందర్భంలో ఆడపిల్లలు సేవాభాయా పాటను స్మరించుకుంటారు. గోధుమలు, శనగలు, గునుగుపూలలా పొడుగ్గా పెరిగితేనే నచ్చిన జీవిత భాగస్వామి దొరుకుతాడని,  తమ బతుకులు పచ్చగా ఉంటాయని,  పిల్లా పాపలు ఆయురారోగ్యాలతో ఉంటారని,  తండా బాగుపడుతుందని గిరిజనుల నమ్మకం. పంటలు బాగా పండుతాయని తండా పెద్దలు భావిస్తారు.  ఏడో రోజు జరిపే కార్యక్రమమే
' ఢమోళి'  అంటారు.  మేరామా భవానికి సమర్పిస్తారు. ఆ రోజు మేరామా భవానికి జంతువులను బలి ఇవ్వడం గిరిజనుల ఆచారం. దీన్నే అకాడో కూడా అంటారు. మేక మాంసాన్ని ఇంటింటికి పంపిస్తారు. ఆరోజు తండా పెద్దమనిషి ఇంటి దగ్గర తీజ్  వద్ద ఆటపాటలతో తండావాసులు అందరూ నృత్యాలతో ఉత్సాహంగా, ఆనందంగా గడుపుతారు. 

కొంచెం దుఃఖం..  కొంచెం  ఆనందం

ఎనిమిదో రోజు తమ లంబాడి ఆరాధ్య దేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి పూజిస్తారు.  వారికి పెళ్లిళ్లు చేస్తారు.  ఆడపిల్లలు తమను  డోక్రిలుగా ఊహించుకుంటారు. పెళ్లి అయితే తమ పుట్టింటిని వదిలి వెళ్లాల్సి వస్తుందని ఏడుస్తారు. వారిని సోదరులు ఓదార్చుతారు. ఆడపిల్లలకు వరుస అయిన బావలు ఆటపట్టిస్తుంటారు.  కొంచెం దుఃఖం,  కొంచెం ఆనందంతో తీజ్ పండుగ ఘనంగా కొనసాగుతుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే తీజ్ నిమజ్జనానికి బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. డప్పు చప్పుళ్లతో గిరిజన సంప్రదాయ బద్దంగా పాటలు పాడుతూ లంబాడీ వేషధారణతో నృత్యాలు చేస్తారు.  తండా పెద్దమనిషి నాయక్ తీజ్ బుట్టలను పెళ్లికాని ఆడపిల్లలకు అందిస్తారు. గిరిజన ఆడపిల్లలు అన్నదమ్ముల ఆశీర్వాదాలు తీసుకుంటారు (ఇది రాఖీ పండుగను పోలి ఉంటుంది ). తీజ్ బుట్టలను పట్టుకొని నిమజ్జనానికి బయలుదేరుతారు. తీజ్ నిమజ్జనం ఓ అద్భుతమైన సన్నివేశం.  ఈ తొమ్మిది రోజులు పాటు ఉప్పు, కారం లేని భోజనం ఒకపూట మాత్రమే తినాలి. తొమ్మిది రోజుల పాటు పెళ్లి కాని యువతులు అత్యంత పవిత్రంగా ఉండాలి. స్నాన మాచరించి భక్తి శ్రద్ధలతో తమ దేవతలను పూజించాలి. తండా నుంచి బయటకు వెళ్లకూడదు. బావి నుంచి   తెచ్చిన బిందెను ఎక్కడా నేలపై పెట్టకూడదు.  బావి నీరు తీసుకొచ్చి నేరుగా పందిరిపై పెట్టిన బుట్టలలో పోయాల్సిందే.  ప్రతి ఏటా ఆగస్టు నెలలో శ్రావణం మాసంలో తీజ్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. సీత్లా భవాని, తీజ్ పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక తేదిని కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన లంబాడీలు రాష్ట్ర ముఖ్యమంత్రిని  కోరుతున్నారు. 

- లకావత్ చిరంజీవి నాయక్​
కాకతీయ విశ్వవిద్యాలయం