హైదరాబాద్ వనస్థలిపురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాషియర్ ప్రవీణ్ ఇవాళ హయత్ నగర్ కోర్టులో లొంగిపోయాడు. ఈనెల 10న బ్యాంక్ ఆఫ్ బరోడా సాహెబ్ నగర్ బ్రాంచ్ లో 22 లక్షల 53 వేలతో క్యాషియర్ ప్రవీణ్ పరారైనట్లు మేనేజర్ వినయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు ప్రవీణ్ కోసం గాలిస్తుండగా..అతడు పోలీసులకు దొరకకుండా కోర్టులో లొంగిపోయాడు. దీంతో కోర్టు అతడికి ఈ నెల 30 వరకు రిమాండ్ విధించింది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడాలో చాలా అవకతవకలు ఉన్నాయని క్యాషియర్ ప్రవీణ్ ఆరోపించాడు. తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని..బ్యాంకులో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకునేందుకే తనను దోషిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించాడు. అతి త్వరలో బ్యాంక్ మోసాలను బయట పెడతానని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ స్థాయిలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో కుంభకోణాలు జరుగుతున్నాయని..త్వరలోనే పూర్తి ఆధారాలతో నిరూపిస్తానని చెప్పాడు.