మా డబ్బులు ఇంకెప్పుడిస్తారు .. అచ్చంపేట ఎస్బీఐ మేనేజర్‌‌‌‌‌‌‌‌ను నిలదీసిన బాధితులు

మా డబ్బులు ఇంకెప్పుడిస్తారు .. అచ్చంపేట ఎస్బీఐ మేనేజర్‌‌‌‌‌‌‌‌ను నిలదీసిన బాధితులు
  • బ్యాంక్ క్లర్క్ కాజేసిన సొమ్ము 21 మంది ఖాతాదారులకు ఇంకా ఇవ్వలే

అచ్చంపేట, వెలుగు: అచ్చంపేటలో  ఓ బ్యాంకు ఉద్యోగి 21 మంది ఖాతాదారుల డబ్బులు కాజేసి  రెండేళ్లు గడిచినా  నేటికీ డబ్బులు రాకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.  సోమవారం బాధితులు అచ్చంపేట ఎస్‌‌‌‌బీఐ బ్యాంక్ మేనేజర్ హుస్సేన్ బాషాను కలిసి తమ డబ్బులు ఇవ్వాలని నిలదీశారు.  అచ్చంపేట నియోజకవర్గంలోని 21 మంది ఖాతాదారుల అకౌంట్ నుంచి బ్యాంకులో క్లర్కుగా పనిచేసే కిరణ్ కుమార్ 2023లో దాదాపు రూ. కోటిన్నర ఇతర అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసుకుని కాజేశాడు. విషయం తెలుసుకున్న బాధితులు బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో త్వరలోనే డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

  బ్యాంకు ఉద్యోగి కిరణ్ పై కేసు నమోదు చేయడంతో పాటు సస్పెండ్ చేశారు.  ఖాతాదారుల డబ్బులు మాత్రం రెండు సంవత్సరాలైనా రాకపోవడంతో నిత్యం బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఖాతాదారులు వాపోతున్నారు.  ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ..  ఈ నెలాఖరులోగా ఖాతాదారులందరికీ డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నెలాఖరులోగా డబ్బులు చెల్లించకుంటే  హైదరాబాద్‌‌‌‌లోని ఎస్‌‌‌‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఖాతాదారులతో ఆందోళన చేపడుతామని టీపీసీసీ ఎన్నారై సెల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ బొజ్జ అమరేందర్ రెడ్డి హెచ్చరించారు. 

 ఈ ప్రాంత పేద ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకునేది  లేదని హెచ్చరించారు. ఈ విషయంపై ఎస్‌‌‌‌బీఐ ఆర్ఎం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఖాతాదారుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఖాతాదారులు బందగి, నాగ గౌడ్ , సునంద, లింగారెడ్డి, నరేందర్, వెంకట్ రెడ్డి, మల్లేశ్ శేఖర్ , హసీనా తదితరులు పాల్గొన్నారు.