సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించండి, డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండండి, అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలు నమ్మకండి.. హానికరమైన లింక్‌లపై క్లిక్ చేయకండి.. అని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా.. ఎన్ని ప్రకటనలు చేస్తున్నా మోసపోతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఏమవుతుందిలే అన్నట్టు ఏమరపాటుగా ఉండటం.. డబ్బులు పోగొట్టుకున్నాక లబోదిబోమని ఏడవటం కామన్ అయిపోయింది.
ALSO READ | పీఎఫ్ కట్ అవుతున్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. 2025 మే లేదా జూన్ తర్వాత..
మోసపోతున్న వారిలో చదువుకున్నోళ్లు.. చదవుకోనోళ్లు అన్న తేడా లేదు. నిజానికి అక్షరాలు తెలియని వారి కంటే.. అక్షరాలు తెలిసిన వారే ఎక్కువగా మోసపోతున్నారు. తాజాగా, DRDOకి చెందిన 57 ఏళ్ల సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఒకరు స్కామర్ల చేతిలో మోసపోయి రూ. 13 లక్షలు పోగొట్టుకున్నారు.
బ్యాంకు ఖాతా KYC పేరుతో
బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌లుగా నటిస్తూ బ్యాంకు ఖాతా KYC పేరుతో సదరు DRDO ఉద్యోగిని నమ్మించారు. వెంటనే KYCవివరాలు అప్‌డేట్ అప్‌డేట్ చేయకుంటే అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని మాయమాటలు చెప్పారు. భయపడిపోయిన ఆయన అందుకు ఏం చేయాలని వారి సలహా అడిగారు. అదే ఆయన మరో తప్పు. బ్యాంకుకెళ్లి వివరాలు అప్‌డేట్ చేపించుకుంటాను అనుంటే సరిపోయేది. వారి సలహా అడిగే సరికి నేరగాళ్లు కొట్టేయడానికి ఇదే మంచి మార్గమని అందినకాడికి దోచేశారు. బాధితుడి ఫోన్‌లో రిమోట్ యాక్సెస్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేపించి అతని బ్యాంక్ ఖాతా నుండి రూ.12.95 లక్షలు స్వాహా చేశారు. ఈ ఘటనపై పుణె సిటీ సైబర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
ఈ చిట్కాలు పాటించండి.. మోసపోకండి
- అపరిచిత వ్యక్తుల నుంచే సందేశాలకు, ఫోన్ కాల్స్‌కు దూరంగా ఉండండి.
- తెలియని వ్యక్తులు కాల్ చేసి.. మీపై కేసు నమోదయ్యింది, మీరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు వంటివి చెప్పగానే గుడ్డిగా నమ్మకండి.
- apk ఫైల్స్ అనేవి డౌన్‌లోడ్ చేయకండి. ఇటువంటి యాప్ లు మీ వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి అవకాశం ఉంది.
- మీకు గిఫ్టులు, లాటరీలు తగిలాయని వచ్చే లింక్‌లపై క్లిక్ చేయకండి.
- బ్యాంకు ఖాతా KYC అప్‌డేట్ చేసుకోవాలని కాల్స్ వస్తే.. నేరుగా బ్యాంకును సంప్రదించండి.
- ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాలు ఎక్కువయ్యాయి.. అప్రమత్తంగా ఉండండి.
డిజిటల్ అరెస్ట్ అనే పద్దతి లేదు. ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్న సైబర్ మోసం ఇది. పోలీస్ యూనిఫాంలో ఎవరైనా వీడియో కాల్ చేసి బెదిరిస్తే భయపడొద్దు. తక్షణమే 1930కు ఫిర్యాదు చేయండి. అప్రమత్తంగా ఉండండి.#TelanganaPolice #DigitalArrest #BeAlert #CyberCrime pic.twitter.com/ys5P5e9uuj
— Telangana Police (@TelanganaCOPs) January 3, 2025