పోలీసుల అదుపులో బ్యాంక్‍ మేనేజర్‍ హంతకులు!

  • నిందితుల్లో ఒకరు రిపోర్టర్‍గా చెలామణి అయ్యే వ్యక్తి? 
  • హనుమకొండ కలెక్టరేట్‍ దగ్గర్లో హత్య చేసినట్లు అనుమానం

 వరంగల్‍ సిటీ, వెలుగు: బ్యాంక్‍ మేనేజర్‍ మర్డర్‍ కేసులో ఇద్దరు నిందితులు వరంగల్ మట్వాడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. హనుమకొండ శ్రీనగర్‍ కాలనీ, రాఘవేంద్ర నగర్‍లో ఉండే ఏపీజీవీబీ రిటైర్డ్  వెలిగేటి రాజమోహన్‍ ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి వెంట తీసుకెళ్లి హత్య చేశారు. 

మంగళవారం ఉదయం కేఎంసీ రంగంపేటలో స్థానికులు కారులో రాజమోహన్‍ డెడ్ బాడీని చూసి పోలీసులకు చెప్పడంతో ఘటన బయటకొచ్చింది. కాగా రాజమోహన్ ఒంటిపై ఉన్న దాదాపు రూ.5 లక్షల విలువైన నగలు కోసమే తెలిసిన వ్యక్తులు హత్య చేశారని పోలీసులు భావించారు. అతని బంధుమిత్రులను కూడా విచారించారు. దీంతో రెండు, మూడు నెలల కింద రాజమోహన్‍కు దగ్గరైన ఓ వ్యక్తి హత్య చేయించినట్టు తెలిసింది. 

హనుమకొండ కలెక్టరేట్‍, సుబేదారి పీఎస్ దగ్గర్లోని ఓ కాలనీలో ఉండే గదిలో చిత్రహింసలకు గురి చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒకరిద్దని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకోగా.. శుక్రవారం రూరల్‍ ఏరియాలో లీడర్‍గా చలామణి అవుతూ..రిపోర్టర్‍ అంటూ చెప్పుకునే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, రాజమోహన్‍ పెద్ద కూతురు అమెరికా నుంచి రావడంతో అంత్యక్రియలు ముగిశాయి. నేడు లేదంటే రేపు నిందితుల అరెస్ట్ పోలీసులు చూపనున్నట్లు తెలుస్తోంది.