- 42 నకిలీ చెక్కులతో సంతకాల ఫోర్జరీ
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
పంజాగుట్ట, వెలుగు: బ్యాంకు అధికారులు, సిబ్బంది కుమ్మక్కై ఎన్నారై ఖాతా నుంచి రూ.6.5 కోట్లను కొట్టేశారు. హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పరితోష్ ఉపాధ్యాయ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉంటున్నాడు. హైదరాబాద్ బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో 2017 నుంచి ఆయన ఓ ప్రీమియం ఖాతా నిర్వహిస్తున్నాడు. ఆయన ఖాతాలో రూ.6.5 కోట్ల నిల్వలు ఉన్నాయి. తాను భారత్ లో లేని సమయంలో తనకు తెలియకుండా బ్యాంకు సిబ్బంది 42 నకిలీ చెక్కులను వినియోగించి సంతకాలను ఫోర్జరీ చేసి తన అకౌంట్ నుంచి డబ్బు కాజేశారని పంజాగుట్ట పోలీసులకు ఉపాధ్యాయ ఫిర్యాదు చేశాడు. తన ప్రమేయం లేకుండా ఖాతాను తొలగించేందుకు ప్రయత్నించినట్టు మొయిల్ ద్వారా తెలిసిందన్నాడు.
రెండేండ్ల కిందట ఈ ఘటన జరిగిందని తెలిపాడు. ‘‘మోసం జరిగిందని బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా విషయం బయటకు రాకుండా చూశారు తప్ప ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఈ అంశాన్ని బ్యాంకు సీఈఓ అమితాబ్ చౌధరికి మొయిల్ ద్వారా విషయాన్ని చేరవేశాను. దాంతో నా మొయిల్ను సైతం తొలగించడానికి ప్రయత్నించారు. ఇప్పటి వరకు రూ.6.5 కోట్లు నకిలీ చెక్కుల ద్వారా విత్ డ్రా చేసినట్లు తేలింది.
ALSO READ : సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ సప్లయ్.. ఇద్దరు నిందితులు అరెస్ట్
మోసం వెనుక బ్యాంకు సీనియర్ పార్టనర్ పాసర్ల వెంకటరమణ, సర్వీసు పార్టనర్ సురేఖ శైనీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరివిజయ్, బ్రాంచ్ మేనేజర్ శ్రీదేవిపై అనుమానం ఉంది” అని బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.