అప్పు కోసం బ్యాంక్ సిబ్బంది అరాచకం : మహిళల ఇంటి ఎదుట పొయ్యి పెట్టారు..!

అప్పు కోసం బ్యాంక్ సిబ్బంది అరాచకం : మహిళల ఇంటి ఎదుట పొయ్యి పెట్టారు..!

అప్పు కోసం బ్యాంక్ సిబ్బంది చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. మహిళలు అని కూడా చూడకుండా ఆ బ్యాంక్ సిబ్బంది చేసిన పనులు మరీ టూ మచ్ గా ఉన్నాయి. ఇంటి ముందు పొయ్యి పెట్టి ఆ మహిళలను అవమానించటం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ ఆ మహిళల అప్పు ఎంతో తెలుసా.. 61 వేల రూపాయలు మాత్రమే.. ఈ 61 వేల కోసం ఆ బ్యాంక్ సిబ్బంది ఇంత అరాచకం చేయాలా అంటూ తిట్టిపోస్తున్నారు జనం.. నెటిజన్లు. ఈ వ్యవహారం పూర్తి వివరాల్లోకి వెళితే..

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి అనే మహిళ.. తెలంగాణ గ్రామీణ బ్యాంకులోని మహిళా సంఘంలో అప్పు తీసుకున్నది. తీసుకున్న అప్పుకు.. 61 వేల రూపాయలు బాకీ పడింది. ఈ డబ్బులు కట్టాలని పదే పదే బ్యాంక్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. పరిస్థితులు బాగోలేదు.. కష్టాల్లో ఉన్నాం.. అప్పు కట్టటానికి సమయం కావాలని కోరుతూ వచ్చింది గుగులోతు లక్ష్మి. ఆ మహిళ మొర ఆలకించని బ్యాంక్ సిబ్బంది ఏకంగా ఇంటికే వచ్చారు.. అప్పు కడతావా సస్తావా అంటూ ఇంటి ఎదుట హంగామా చేశారు.

Also Read :- హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాదం..యువకుడు మిస్సింగ్

అంతటితో ఆగని బ్యాంక్ సిబ్బంది.. గుగలోతు లక్ష్మి ఇంటి ఎదుట వంటావార్పు అంటూ పొయ్యి వెలిగించారు. అప్పు కట్టాలని గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంటావార్పు చేశారు బ్యాంక్ సిబ్బంది. ఇప్పటికిప్పుడు 10 వేల రూపాయలు కట్టాలని.. ఫిబ్రవరి 28వ తేదీలోపు మరో 51 వేల రూపాయలు కట్టి తీరాల్సిందే అని.. కట్టకపోతే అందరం వచ్చి ఇంటి ముందు కూర్చుంటామని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు బ్యాంక్ సిబ్బంది. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లక్ష కోట్లు ఎగ్గొట్టిన వాళ్ల ఇళ్లకు వెళ్లి ఇలాగే బెదిరిస్తున్నారా.. దౌర్జన్యం చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. బ్యాంకుల నుంచి వేల కోట్లు తీసుకుని ఎగ్గొట్టి.. మన ముందే తిరుగుతున్న రాజకీయ నాయకుల సంగతి ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. సామాన్యులకు ఒక న్యాయం.. ధనవంతులకు ఒక న్యాయమా అని నిలదీస్తున్నారు నెటిజన్లు.