గూగుల్‍లో చూసి.. బ్యాంక్‍ లో చోరీ

  • రాయపర్తి బ్యాంకు చోరీ యూపీ, మహారాష్ట్ర ముఠా పనే
  • ముగ్గురు అరెస్ట్ .. పరారీలో మరో నలుగురు
  • 2.520 కిలోల బంగారు ఆభరణాల రికవరీ 
  • వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ అంబర్‍ కిషోర్‍ వెల్లడి 

వరంగల్‍, వెలుగు :రాయపర్తిలో ఎస్‍బీఐ బ్యాంకు చోరీలో యూపీ, మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా పాల్గొన్నట్లుగా వరంగల్‍ పోలీసులు తేల్చారు. ఉమ్మడి జిల్లా చరిత్రలోనే గత నెల18న అర్ధరాత్రి జరిగిన రూ.13. 61 కోట్ల విలువైన బంగారు అభరణాలు చోరీ కాగా..  ముఠాలోని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. 2. 520 కిలోల గోల్డ్ రికవరీ చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. 

శుక్రవారం వరంగల్‍ కమిషనరేట్ లో సీపీ అంబర్‍ కిషోర్‍ ఝా ప్రెస్‍మీట్‍ లో వివరాలు వెల్లడించారు.  యూపీలోని బదౌన్‍ జిల్లా కక్రలా గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్‍ నవాబ్‍ హసన్‍ (39), అదే రాష్ట్రానికి చెందిన అర్షాద్‍ అన్సారీ (34), షాకీర్‍ ఖాన్‍ (28), హిమాన్షు బిగాం చంద్‍ జాన్వర్‍(30), సాజిద్‍ ఖాన్‍ (35)తో పాటు మహారాష్ట్రకు చెందిన అక్షయ్‍ గజానన్‍ అంబోర్‍ (24), సాగర్‍ భాస్కర్‍ గోర్‍ (32) ముఠాగా ఏర్పాడ్డారు. 

హైదరాబాద్ కు వచ్చి బిజినెస్ ముసుగులో ఒక ఇంటిని కిరాయికి తీసుకున్నారు. గ్రామాల్లోని  బ్యాంకులే టార్గెట్ గా గూగుల్‍ మ్యాప్ లో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల వివరాలు సేకరించారు. అందులో సెక్యూరిటీ తక్కువగా ఉండేవాటిపై బ్యాంకులను టార్గెట్ చేశారు. రాయపర్తిలోని ఎస్‍బీఐ బ్యాంకు వద్ద పలుమార్లు రెక్కీ చేసి సెక్యూరిటీ కూడా లేదని నిర్ధారణకు వచ్చారు. గత నెల 18న అర్ధరాత్రి ముఠా హైదరాబాద్‍ నుంచి కారులో బ్యాంకు వద్దకు చేరుకుంది.  

పంట పొలాల వెనకనుంచి బ్యాంకులోకి వెళ్లేందుకు కిటికీని తొలగించారు. ముందుగా సెక్యూరిటీ అలారంతో పాటు సీసీ కెమెరాల వైర్లను కట్‍ చేశారు. బ్యాంక్‍ స్ట్రాంగ్‍ రూమ్ లాక్  పగలగొట్టి గ్యాస్‍ కట్టర్లతో మూడు లాకర్ల కట్ చేశారు. అందులోని రూ.13. 61 కోట్ల విలువైన 19 కిలోల బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారు. అయితే.. గ్యాస్‍ సిలిండర్‍, ఇతర సామగ్రిని అక్కడే వదిలేసి సీసీ కెమెరాల డీవీఆర్‍లను తీసుకెళ్లారు. వచ్చిన కారులోనే హైదరాబాద్‍కు వెళ్లారు. చోరీ సొత్తును 7 వాటాలుగా పంచుకుని మరుసటి రోజు  తమ రాష్ట్రాలకు పరార్ అయ్యారు. 

ముందుగా కారును ఐడెంటీఫై చేసి.. 

జిల్లాలో జరిగిన భారీ చోరీ కావడంతో వరంగల్‍ కమిషనరేట్‍ పోలీసులు చాలెంజ్‍గా తీసుకుని.. వెస్ట్ జోన్‍ డీసీపీ మహేంద్రనాయక్‍ , వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, సీసీఎస్‍ ఏసీపీ భోజరాజు, నర్సంపేట ఏసీపీ కిరణ్‍ కుమార్‍ ఆధ్వర్యంలో 10 పైగా టీమ్ లు దర్యాప్తు కొనసాగించాయి. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు రాయపర్తి వైపు చోరీ జరిగిన సమయంలో వచ్చివెళ్లిన నిందితుల కారును ముందుగా గుర్తించారు. యూపీకి చెందిన అర్షద్‍, షాకీర్‍ ఖాన్‍, కారు డ్రైవర్‍ హిమాన్షు బిగాం పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.1 కోటి 80 లక్షల విలువైన 2. 520 కిలోల బంగారు ఆభరణాల తో పాటు కారు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

వరంగల్‍ సీపీ అంబర్‍ కిషోర్‍ ఝా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సెక్యూరిటీ లేని బ్యాంకులనే దొంగల ముఠాలు టార్గెట్‍ చేస్తున్నాయన్నారు. కొత్త రకం టెక్నాలజీని పెంచుకోవాలని బ్యాంకు అధికారులకు సూచించారు. దర్యాప్తులో ప్రతిభ చూపిన ఇన్ స్పెక్టర్లు సంతోష్​, శ్రీనివాసరెడ్డి, బాలాజీ వరప్రసాద్‍, శివకుమార్‍, రఘుపతిరెడ్డి, శ్రీనివాసరావు, మహేందర్‍రెడ్డి, అబ్బయ్య, పవన్‍ కుమార్‍, విశ్వేశ్వర్‍, ఏఏఓ సల్మాన్‍ పాషాను అభినందించారు.