ఆధార్​లింక్ కోసం వెళ్లి..ప్రాణాలు కోల్పోయిన దివ్యాంగుడు

గుండాల, వెలుగు: బ్యాంక్​అకౌంట్ కు ఆధార్​నంబర్​లింక్ చేసుకునేందుకు బ్యాంక్​కు వెళ్లిన ఓ దివ్యాంగుడు రోజంతా నిలబడి ప్రాణాలు కోల్పోయాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలానికి చెందిన మొక్క ఆదినారాయణ దివ్యాంగుడు. ఎక్కువ సేపు నిలబడలేడు. శుక్రవారం ఉదయం తన బ్యాంక్​అకౌంట్​కు ఆధార్​లింక్​చేసుకునేందుకు భార్య సమ్మక్కతో కలిసి కాచనపల్లి ఎస్​బీఐ బ్రాంచ్​కు వెళ్లాడు. బ్యాంకులో సిగ్నల్ రాకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నాడు.

ఈ క్రమంలో సొమ్మసిల్లి పడిపోయాడు. సమ్మక్క108కు కాల్ చేయగా, వెహికల్​అందుబాటులో లేదని చెప్పడంతో ప్రైవేట్​వెహికల్​మాట్లాడుకుని గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. సీరియస్ గా ఉందని చెప్పడంతో మరో వెహికల్ లో వరంగల్ తరలించింది. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఆదినారాయణ చనిపోయాడు. 108 సమయానికి వస్తే నా భర్త బతికేవాడని మృతుడి భార్య సమ్మక్క రోధించిన తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది.