ఆసరాను అప్పుకింద జమేసుకుంటున్రు.. ఉపాధి పైసలూ ఆపుతున్న బ్యాంకర్లు

  •     కలెక్టర్​ ఆదేశాలనూ పట్టించుకోవడంలేదు..
  •     నిరసనకు దిగుతున్న బాధితులు
  •     వసూలు కోసమేనని చెబుతున్న బ్యాంకు సిబ్బంది

భద్రాద్రికొత్తగూడెం/చండ్రుగొండ,వెలుగు

 వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్​డబ్బులను బ్యాంకర్లు ఆపుకుంటున్నారు. వీటితోపాటు ఉపాధి కూలీ డబ్బులను కూడా క్రాప్​ లోన్ల కింద పట్టుకుంటున్నారు. రైతులు తీసుకున్న లోన్లకు వడ్డీ కట్టకపోతే వారి ఖాతాలను ఫ్రీజింగ్ చేస్తూ ఆ ఖాతాల్లోకి వచ్చే డబ్బులను  నిలిపేస్తున్నారు. ఇదే విషయాన్ని పలువురు బాధితులు కలెక్టర్​దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్​బ్యాంకర్లపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా తీరు మారడంలేదు. దీంతో బాధితులకు కష్టాలు తప్పడం లేదు. గురువారం ఆసరా పెన్షన్ దారులు, ఉపాధి కూలీలు చండ్రుగొండ ఏపీజీవీబీ బ్యాంక్ ఎదుట నిరసనకు దిగారు.

గ్రీవెన్స్​లో ఫిర్యాదు చేసినా...

ఆసరా పెన్షన్లు, ఉపాధి కూలి డబ్బులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దని కలెక్టర్​హెచ్చరించినా బ్యాంకర్లు మాత్రం డోంట్​కేర్​అంటున్నారు. పేదల ఆసరా పెన్షన్ కు బ్యాంకర్లు గండి కొడుతున్నారు. మండు టెండల్లోనూ ఉపాధి కూలి పనిచేసుకుంటున్న పేదలకు బ్యాంకర్లు మొండి చేయి చూపుతున్నారు. తమ బ్యాంకు ఖాతాల్లో ఉన్న కూలి డబ్బులను కూడా బ్యాంకర్లు వదలడం లేదు. ఆ డబ్బులను హోల్డ్ లో పెడుతుండడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. తనకు14 నెలలుగా పెన్షన్​డబ్బులు ఇవ్వకుండా కొత్తగూడెం ఆంధ్రాబ్యాంక్​ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారని టేకులపల్లి మండలం బేతంపూడికి చెందిన నునావత్​లాల్య గ్రీవెన్స్ లో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు డబ్బులు ఇప్పించాలని ఆయన వేడుకున్నారు. తన కొడుకులు బ్యాంక్​లోన్​చెల్లించడం లేదని తన పెన్షన్​ను ఏపీజీవీబీ బ్యాంక్​ఆఫీసర్లు ఆపేశారని అశ్వారావుపేట మండలానికి చెందిన పెన్షన్ దారుడు కలెక్టర్​కు గ్రీవెన్స్​లో ఫిర్యాదు చేశాడు. ఇలా ఆసరా పెన్షన్, ఉపాధి కూలి డబ్బులను బ్యాంకర్లు హోల్డ్ లో పెట్టడంపై లబ్ధిదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రుణమాఫీ కాని కారణంగానే... 

జిల్లాలోని చండ్రుగొండ ఏపీజీవీబీ బ్యాంక్ ఎదుట ఆసరా, ఉపాధి కూలీలు గతంలో ఆందోళన చేశారు. తమ ఆరోగ్య సమస్యలు, మెడిసిన్​తోపాటు అవసరాలకు ఉపయోగపడే పెన్షన్​డబ్బులను లోన్లు కట్టడం లేదనే సాకుతో బ్యాంకర్లు హోల్డ్​లో పెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చండ్రుగొండ మండలంలోని దామరచర్ల, పోకలగూడెం, తిప్పనపల్లి, బాల్యతండా, దుబ్బతండా, రావికంపాడు, గానుగపాడు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఏపీజీవీబీలో ఖాతాలు ఉన్నాయి. వీటి ద్వారా తమ లావాదేవీలు నడుపుతున్నారు. రైతులు తీసుకున్న క్రాప్ లోన్లను మాఫీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో కట్టలేదు. దీంతో బ్యాంకర్లు అకౌంట్ లను హోల్డ్ లో పెట్టారు. పెన్షన్, ఉపాధి కూలి డబ్బులను అప్పుల్లో జమ చేయవద్దని లబ్ధిదారులు  కోరుతున్నారు..

రుణాల కోసమే హోల్డ్ లో పెట్టాం..

వ్యవసాయ రుణాల బకాయిలు పెరుగుతున్నయ్. ఆసరా పెన్షన్, ఉపాధి కూలీల అకౌంట్ లను హోల్డ్ లో పెడుతున్నాం. ఇది తమ వ్యక్తిగత కక్ష కాదు. బ్యాంక్ అభివృద్ధి కోసం చేస్తున్నాం. అప్పులు చెల్లించాలని నోటీసులు పంపినా పట్టించుకోవడంలేదు. బ్యాంక్ లో రూ.22 కోట్లు డిపాజిట్లు ఉండగా, క్రాప్ లోన్ రూ.28 కోట్లు, ఎస్ హెచ్ జీ రూ.15.50 కోట్లు అప్పులు ఇచ్చాం. దీంతో బ్యాంక్ లావాదేవీలు కష్టమవుతున్నాయి. అప్పులు చెల్లిస్తే వెంటనే హోల్డ్ తీసేస్తాం.
–రవికుమార్, బ్యాంక్ మేనేజర్, ఏపీజీవీబీ, చండ్రుగొండ

అప్పు ఉందని డబ్బులిస్తలేరు... 

మూడేండ్ల కింద వ్యవసాయానికి బ్యాంక్ లో రూ.60 వేలు అప్పు తీసుకున్న. రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని సర్కార్ చెప్పింది. రుణమాఫీ వస్తదని డబ్బులు కట్టలేదు. అందుకని పెన్షన్ డబ్బులను రెండు నెలలుగా ఇస్తలేరు. రెండేండ్లుగా పంటలు సరిగా పండక లోన్​ డబ్బులు కట్టేందుకు కొంత టైం కావాలని బతిమలాడినా అకౌంట్ హోల్డ్ పెట్టి ఇబ్బంది పెడుతున్నరు.
– భూక్యా మిట్టు, బాధితుడు