- మోటార్లు మునగడం, పిల్లర్లు కుంగడంపై ఆందోళన
- లోన్ రీ పేమేంట్‌పై ఇంజినీర్లను ప్రశ్నించిన అప్పులిచ్చిన బ్యాంకుల చీఫ్ మేనేజర్లు
- మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌ల పరిశీలన
జయశంకర్ భూపాలపల్లి, మహదేవపూర్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి వేల కోట్ల రూపాయలు అప్పులిచ్చిన బ్యాంకర్లలో గుబులు మొదలైంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం, కన్నెపల్లి పంప్‌హౌస్ నీట మునిగి మోటార్లు తుక్కు తుక్కు కావడం, అన్నారం బ్యారేజీలో బుంగలు పడటం, పంప్‌హౌస్ నీట మునగడం వంటి ఘ టనలు జరగడంతో ప్రాజెక్టును ఆయా బ్యాంకుల చీఫ్ మేనేజర్లు శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
బ్యారేజీల, పంప్‌హౌస్‌ల రూపురేఖలు చూసి ఆందోళన చెందారు. బ్యారేజీల పిల్లర్లు కుంగడం, పంప్‌హౌస్‌ల మోటార్లు మునగడంపై ఇంజినీర్లను ప్రశ్నించారు. ప్రాజెక్టే పనిచేయకపోతే ఏటా చెల్లించాల్సిన లోన్ రీపేమెంట్ ఈఎంఐ ఎలా చెల్లిస్తారని ఆరా తీశారు.
వివిధ బ్యాంకుల నుంచి ఆఫీసర్లు
రాష్ట్రంలో గత సర్కారు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.93,872 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో రూ. 32,206 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా కాగా మిగిలిన రూ. 61,665 కోట్లను కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్‌పేరిట వివిధ బ్యాంకుల్లో అప్పులుగా తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. వడ్డీ, అసలు కలిపి ఏటా రూ.14,462 కోట్ల లోన్ రీపేమెంట్‌ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో సర్కారు మారడం, మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, పంప్‌హౌస్‌లు నీట మునగడం వంటి వరుస సంఘటనల నేపథ్యంలో అప్పులిచ్చిన బ్యాంకర్లలో ఆందోళన మొదలైంది.
మీడియాలో వచ్చిన కథనాలు చూసి క్షేత్రస్థాయి పర్యటనకు విచ్చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకే హైదరాబాద్‌లోని జలసౌధ నుంచి మూడు వాహనాల్లో నేరుగా భూపాలపల్లి జిల్లాకు చేరుకున్నారు. యూనియన్ బ్యాంక్ జీఎం కృష్ణ న్, ఏజీఎం మల్లికార్జున్ రెడ్డి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏజీఎం లక్ష్మీనారాయణ, కెనరా బ్యాంక్ డీజీఎం అశోక్ కుమార్, అడిషనల్ చీఫ్ మేనేజర్ రఘురాం రాయలు, ఇండియన్ బ్యాంక్ డీజీఎం వికాస్ మనహస్
అసిస్టెంట్ మేనేజర్ ఆర్ ఇలంగో వేలాయుతం, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ మేనేజర్ హితేష్ శర్మ, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ రాఘవేంద్ర పాల్, సీనియర్ మేనేజర్ వివేక్, లు లింక్ వన్ ప్రాజెక్టును పరిశీలించారు. వీరి వెంట కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ సీఎఫ్ఓజీ ఎల్. బి శాస్త్రి ఉన్నారు.
బ్యాంకర్ల పరిశీలన గోప్యంగా..
బ్యాంకర్ల క్షేత్రస్థాయి పరిశీలనను సైతం ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు సీక్రెట్‌గా నిర్వహించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం12 గంటలకు బ్యాంకర్ల బృందం మేడిగడ్డకు చేరుకుని ఇక్కడ కుంగిన పిల్లర్లను పరిశీలించారు. అనంతరం కన్నేపల్లి పంపు హౌస్, అన్నారం బ్యారే జీ, అన్నారం పంపు హౌస్ లను కూడా పరిశీలించారు. మీడియాకు ఎలాంటి చిన్న క్లూ ఇవ్వొద్దని మంచిర్యాల ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు లోకల్ ఇంజినీర్లను హెచ్చరించినట్లు తెలిసింది.