న్యూఢిల్లీ : యాక్సిస్ బ్యాంక్ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్లో రూ.4,125.26 కోట్ల లాభం సంపాదించింది. 2021 జూన్ క్వార్టర్‌లో వచ్చిన లాభం రూ.2,160.15 కోట్లతో పోలిస్తే ఇది 91 శాతం ఎక్కువ. ఈసారి యాక్సిస్‌కు రూ.3,400 కోట్ల లాభం వస్తుందన్న ఎనలిస్టుల అంచనాలకు మించి ఫలితాలు వచ్చాయి. ఇదే కాలంలో నికర వడ్డీ ఆదాయం 21 శాతం పెరిగి రూ.9,384 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 14 బేసిస్ పాయింట్లు పెరిగి 3.6 శాతానికి చేరింది. ఫీజు ఆదాయం 34 శాతం పెరిగి రూ.3,576 కోట్లకు ఎగిసింది. రిటైల్ ఫీజుల ఆదాయం 43 శాతం పెరిగింది. మొత్తం ఫీజు ఆదాయంలో దీని వాటా 66 శాతానికి చేరింది. మార్చి క్వార్టర్‌తో పోలిస్తే లోన్ లాస్ ప్రొవిజన్లకు కేటాయింపులు రూ.602 కోట్ల నుంచి రూ.777 కోట్లకు పెరిగాయి. ఈ క్వార్టర్లో కొవిడ్ ప్రొవిజన్ల డబ్బును వాడలేదని బ్యాంకు ప్రకటించింది. జూన్ క్వార్టర్నాటికి అన్ని రకాల ప్రొవిజన్ల విలువ రూ.11,830 కోట్లు ఉంది. జీఎన్పీఏలో ప్రొవిజన్ కవరేజ్ రేషియో 134 శాతం ఉంది. గ్రాస్ ఎన్పీఏ రేషియో సీక్వెన్షియల్‌గా 2.82 శాతం నుంచి 2.76 శాతానికి తగ్గింది. జూన్ క్వార్టర్లో బ్యాంకు 9.9 లక్షల క్రెడిట్‌కార్డులను జారీ చేసింది. దీంతో ఈ సెక్టార్లో మార్కెట్ వాటా 17 శాతానికి పెరిగింది. స్థూల ఆర్థిక వ్యవస్థకు ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ మంచి ఫలితాలు సాధించామని యాక్సిస్ బ్యంక్ ఎండీ, సీఈఓ అమితాబ్ చౌదరి చెప్పారు. ఏడాది ప్రాతిపదికన బ్యాంకు బ్యాలన్స్‌షీట్14 శాతం పెరిగి రూ.11,52,580 కోట్లకు చేరింది. క్యూఏబీ బేసిస్‌లో మొత్తం డిపాజిట్లు 14 శాతం పెరిగాయి. అడ్వాన్సులు విలువ 14 శాతం పెరిగి రూ.7,01,130 కోట్లకు చేరాయి. లోన్ టు డిపాజిట్ రేషియో 87 శాతం ఉంది. రిటైల్ లోన్లు 25 శాతం పెరిగి రూ.4,12,683 కోట్లకు చేరాయి. వీటిలో సెక్యూర్డ్ రిటైల్ లోన్ల విలువ 79 శాతం, హోంలోన్ల విలువ రిటైల్ బుక్‌లో 35 శాతం ఉంది.
కరూర్ వైశ్యా బ్యాంక్ లాభం రూ.229 కోట్లు
కరూర్ వైశ్యా బ్యాంక్ నికర లాభం ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్లో రెండింతలు పెరిగి రూ.229 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ రూ.109 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం పెరిగి రూ.746 కోట్లకు చేరుకుంది. ఇది క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.638 కోట్లుగా ఉంది. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ 3.55 శాతం నుంచి 3.82 శాతానికి పెరిగింది. మొత్తం ఆదాయం రూ.1,672.60 కోట్లకు చేరింది. ఈ ఏడాది జూన్ చివరి నాటికి గ్రాస్ ఎన్‌పీఏలు జూన్ 2021తో పోలిస్తే 7.97 శాతం నుండి 5.21 శాతానికి మెరుగుపడ్డాయి. ఇదే కాలంలో నికర ఎన్‌పీఏలు లేదా మొండి బకాయిలు 3.69 శాతం నుంచి 1.91 శాతానికి తగ్గాయి. జూన్ క్వార్టర్లో మొండి బకాయిలు, కంటెంజెన్సీలకు కేటాయింపులు రూ.154.64 కోట్లు ఉన్నాయి. క్రితం ఏడాది జూన్ క్వార్టర్‌లో రూ.247.37 కోట్లతో పోలిస్తే ఇవి 37 శాతానికి పైగా తగ్గాయి. బ్యాంక్ డిపాజిట్ల ఖర్చు 44 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 4.09 శాతానికి చేరుకుంది. బ్యాంక్ జ్యువెల్ లోన్ పోర్ట్‌ఫోలియో రూ.14,873 కోట్లకు చేరుకుంది.
1.27% పెరిగిన ఐసీఐసీఐ షేరు
క్యూ1 రిజల్ట్స్ బాగుండడంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ ధర సోమవారం ఇంట్రాడేలో 2 శాతం పెరిగి రూ.811కి చేరుకుంది. చివరికి 0.11 శాతం లాభంతో రూ.800.9 వద్ద ముగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ నికర లాభం 50 శాతం పెరిగి రూ. 6,905 కోట్లకు చేరుకుంది. 2021 జూన్ క్వార్టర్ బ్యాంక్ లాభం రూ. 4,616 కోట్లుగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం ఆదాయం ఈ క్వార్టర్లో రూ. 28,336.74 కోట్లకు మెరుగుపడింది. ఇది 2021 జూన్ క్వార్టర్‌లో రూ.24,379.27 కోట్లుగా ఉంది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ ధర 4.56శాతం పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కేవలం 0.87శాతం మాత్రమే పెరిగిన విషయం తెలిసిందే.
72% పెరిగిన కెనరా బ్యాంక్ లాభం
కెనరా బ్యాంకు ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్లో రూ.2,022.03 కోట్ల లాభం వచ్చింది. 2021 జూన్ క్వార్టర్‌లో వచ్చిన లాభం రూ.1,177.47 కోట్ల లాభంతో పోలిస్తే 72 శాతం ఎక్కువ. ఇదేకాలంలో మొత్తం ఆదాయం రూ.20,940.28 కోట్ల నుంచి రూ.23,351.96 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం 8.3 శాతం పెరిగి రూ.18,176 కోట్లకు ఎగిసింది. గ్రాస్ ఎన్‌పీఏలు 2022 జూన్ 30 చివరి నాటికి గ్రాస్ అడ్వాన్స్‌లలో 6.98 శాతానికి పడిపోయాయి. విలువపరంగా మొండి బకాయిలు రూ. 58,215.46 కోట్ల నుంచి రూ.54,733.88 కోట్లకు తగ్గాయి. నికర మొండి బకాయిల నిష్పత్తి 3.46 శాతం (రూ. 22,434 కోట్లు) నుంచి 2.48 శాతానికి (రూ. 18,504.93 కోట్లు) తగ్గింది. మొండి బకాయిల ప్రొవిజన్లు (పన్ను మినహాయించి) రూ.3,458.74 కోట్ల నుంచి రూ.3,690 కోట్లకు పెరిగాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన, జూన్ క్వార్టర్లో బ్యాంక్ నికర లాభం 88 శాతం పెరిగి రూ. 2,058.31 కోట్లకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం రూ. 1,094.79 కోట్లుగా ఉంది.