రుణమాఫీతో క్రాప్ లోన్లకు ఊపు..82 శాతం రుణాలిచ్చిన బ్యాంకులు

 రుణమాఫీతో క్రాప్ లోన్లకు ఊపు..82 శాతం రుణాలిచ్చిన బ్యాంకులు
  • వానాకాలం లక్ష్యంలో 82%  రుణాలిచ్చిన బ్యాంకులు
  • యాసంగిలో రూ.36 వేల కోట్ల లోన్లు టార్గెట్
  • ఇప్పటికే రూ.10 వేల కోట్ల రుణాలిచ్చిన బ్యాంకర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల వరకు ఉన్న క్రాప్ లోన్లు మాఫీ చేయడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇస్తున్నాయి. వానాకాలం సీజన్ నుంచే పంట రుణాలు పెంచుతూ వచ్చాయి. ఈ క్రమంలో వానాకాలం కోసం బ్యాంకులు పెట్టుకున్న రుణాల టార్గెట్​లో 82శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2018, డిసెంబర్ 11 నుంచి 2023, డిసెంబర్ 7 వరకు ఉన్న పంట రుణాల్లో రూ.2లక్షల వరకు మాఫీ చేసింది. గత బీఆర్ఎస్ సర్కార్ రుణమాఫీ సరిగ్గా చేయకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాలేవు. స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ మీటింగుల్లో టార్గెట్ పెట్టి మరీ చెప్పినా.. కనీసం 60 శాతానికి మించి ఇవ్వలేదు. వానాకాలంలో 50శాతం, యాసంగిలో 40శాతం రుణాలే ఇచ్చాయి. అవి కూడా బుక్ అడ్జెస్ట్​మెంట్లే తప్ప కొత్త లోన్లు కావు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం.. ఏడాదిలోపే రూ.20వేల కోట్లకు పైగా లోన్లు మాఫీ చేసింది. రుణమాఫీ డబ్బులన్నీ బ్యాంకులకు చేరడంతో.. రైతులకు విరివిగా కొత్త రుణాలు ఇస్తున్నాయి. 

నాలుగు విడతల్లో రుణమాఫీ 

కాంగ్రెస్ సర్కారు మొదటి విడత కింద 2024, జులై 18న 11,34, 412 మంది రైతులకు రూ.6,034.96 కోట్ల రుణం మాఫీ చేసింది. రెండో విడతగా 2024, జులై 30న 6,40,823 మంది రైతులకు రూ.6,190 కోట్ల రుణం మాఫీ చేసింది. మూడో విడతగా 2024, ఆగస్టు 15న ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో 4,46,832 మంది రైతులకు చెందిన రూ.5,644.24 కోట్ల రుణాలను సర్కారు మాఫీ చేసింది. కేవలం 25 రోజుల్లో మూడు విడతల్లో రూ.17,869.21 కోట్లు మాఫీ చేసింది. రైతుల బ్యాంకు ఖాతాల్లో సాంకేతికంగా లోపాలున్న వారికి నవంబరు 30న మహబూబ్​నగర్​లో జరిగిన బహిరంగ సభలో 3,13,896 మంది రైతులకు రూ.2,747.67 కోట్ల రుణమాఫీ ప్రకటించింది.

Also Read :- దీపమే.. దైవం!.. జంగుబాయి అమ్మవారి జాతర

 మొత్తం నాలుగు విడతల్లో ఏడాదిలోనే 25,35,963 మంది రైతులకు సంబంధించి రూ.2లక్షల్లోపు ఉన్న పంట రుణాలు రూ.20,616.89 కోట్లు మాఫీ చేసింది. గత బీఆర్ఎస్ సర్కార్.. రుణమాఫీ సక్రమంగా అమలు చేయకపోవడంతో సుమారు 20లక్షల మందికి పంట రుణాలు అందలేదు. కొందరి ఖాతాల్లో డబ్బులు పడినా.. బ్యాంకులు పాత బాకీ కింద పట్టుకున్నాయి. ఒక్కో బ్యాంక్ 13 నుంచి 14 శాతం వడ్డీ భారం మోపాయి. వడ్డీకి వడ్డి వేస్తూ వచ్చాయి. దీంతో 20లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మారారు.
 
రుణమాఫీతో రైతుల్లో కొత్త ఉత్సాహం

ఈయేడు వానాకాలంలో ఎస్​ఎల్​బీసీకి ప్రభుత్వం రూ.54,480 కోట్లు టార్గెట్ విధించగా.. సీజన్ ముగిసే నాటికి రూ.44,438 కోట్లు (82 శాతం) రుణాలు అందించింది. పంట రుణాలు అందడంతో రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. కాగా, ఈ యాసంగిలో ఎస్​ఎల్​బీసీలో బ్యాంకర్లకు రూ.36,315.19 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే రైతులకు బ్యాంకులు రూ.10వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చాయి. 2025, జనవరి 31 నాటికి సర్కారు ఇచ్చిన టార్గెట్​లో 80శాతం పూర్తి చేస్తామని బ్యాంకులు అంటున్నాయి. 2022-–23 ఆర్థిక సంవత్సరంలో ఎస్ఎల్బీసీ పంట రుణాల కోసం వానాకాలం సీజన్ కు రూ.40,718 కోట్లు టార్గెట్ పెట్టగా.. గత సీజన్ పూర్తయ్యే నాటికి కేవలం రూ.21,272 కోట్లు (52శాతం) మాత్రమే ఇచ్చాయి.