
- 63 శాతం పెరిగిన యెస్ బ్యాంక్ లాభం
- 15.7 శాతం ఎగిసిన ఐసీఐసీఐ బ్యాంక్ లాభం
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 6.6 శాతం జంప్
న్యూఢిల్లీ: మూడు ప్రైవేటు బ్యాంకులు యెస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు అదరగొట్టాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో భారీ లాభాలను సంపాదించాయి. ఏడాది లెక్కన యెస్ బ్యాంక్ లాభం 63 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 15.7 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 6.6 శాతం పెరిగింది. జనవరి–-మార్చి క్వార్టర్లో యెస్ బ్యాంక్ నికర లాభం 63 శాతం పెరిగి రూ.738 కోట్లకు చేరుకుంది. ప్రొవిజన్లు తగ్గడం వల్ల లాభం భారీగా పెరిగింది. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 92.3 శాతం పెరిగి రూ.2,406 కోట్లకు చేరుకుంది. ఈ క్వార్టర్లో నికర వడ్డీ ఆదాయం 5.7 శాతం పెరిగి రూ.2,276 కోట్లకు చేరుకుంది. అడ్వాన్సులు 8.1 శాతం, నికర వడ్డీ మార్జిన్ 0.1 శాతం పెరిగింది.
స్టాండెలోన్ లెక్కన మొత్తం ఆదాయం రూ.9,355.39 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.9,015.77 కోట్లుగా ఉంది. డిపాజిట్లలో వృద్ధి 6.8 శాతం కనిపించింది. స్థూల ఆర్థిక పరిస్థితులను బట్టి రుణ వృద్ధిని 12–-15 శాతం మధ్య లక్ష్యంగా పెట్టుకుంటామని, డిపాజిట్ వృద్ధి రుణ వృద్ధి కంటే ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్ కుమార్ విలేకరులతో అన్నారు. కరెంట్, సేవింగ్ అకౌంట్ బ్యాలెన్స్‌ల వాటా గత సంవత్సరం ఇదే కాలంలో 30.9 శాతం నుంచి 34.3 శాతానికి పెరిగింది.
యెస్ బ్యాంక్ పొదుపు ఖాతాపై వడ్డీని రెండుశాతానికి తగ్గించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 37 శాఖలను ప్రారంభించామని, రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రతి ఏటా 80 శాఖలను మొదలుపెడతామని ప్రశాంత్వెల్లడించారు. రిపోర్టింగ్ క్వార్టర్లో వడ్డీయేతర ఆదాయం 10.9 శాతం పెరిగి రూ.1,739 కోట్లకు చేరుకుంది. మొత్తం కేటాయింపులు ఏడాది కాలంలో 32.5 శాతం తగ్గి రూ.318 కోట్లకు చేరుకున్నాయి. క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి గత సంవత్సరం ఇదే కాలంలో 88 శాతం నుంచి 86.5 శాతానికి తగ్గింది.