ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు సొమ్మును బ్యాంకులు పాత బకాయిల కింద వసూలు పెట్టుకొని రైతులను వట్టి చేతులతో పంపుతున్నాయి. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వమే అని సమాధానం వస్తుంది. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయలేదు. మూడేండ్లుగా రైతులు అప్పులు కట్టకపోవడంతో అసలు, వడ్డీ పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు నిధులను బ్యాంకులు పాత బకాయిల కింద వసూలు పెట్టుకున్నాయి. అంటే రైతుబంధు డబ్బులు బ్యాంకుల్లో చిక్కుకుపోవడానికి కారణం రాష్ట్ర సర్కారే అని అర్థమవుతోంది. పంట రుణాల మాఫీని సకాలంలో పూర్తి చేసినట్లయితే బ్యాంకులు ఈ పైసలను జమ చేసుకునేవి కాదు. రైతులు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన పని తప్పేది.
ప్రస్తుతం బ్యాంకుల్లో రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్లు ఉన్నాయి. రైతుకు ఉన్న భూవిస్తీర్ణం, వేసే పంటలు, మిగతా అర్హతల ఆధారంగా వీటికి సంబంధించిన రుణ పరిమితిని నిర్ణయిస్తున్నారు. కంప్యూటర్ లో ఉన్న ఈ లిమిట్ వల్ల సిస్టమ్ కేవలం వడ్డీ తదితర అంతర్గత డెబిట్లను మాత్రమే అంగీకరిస్తుంది. ఉదాహరణకు రూ.లక్ష లోను తీసుకున్న ఖాతాలో ట్రాన్స్ ఫర్ డెబిట్లు తప్ప రూ.లక్షను దాటి క్యాష్ విత్ డ్రాలను ఒప్పుకోదు. 2018 నుంచి కట్టని లక్ష రూపాయల పంట అప్పు బ్యాలెన్సు ఇప్పుడు యాభై వేలు ఉన్నా జమైన ఏ సొమ్మును తీసుకొనేందుకు అంగీకరించదు. ఎందుకంటే పంట అప్పు స్వల్ప కాలిక రుణం. ఏడాదిన్నరలోగా పూర్తిగా చెల్లించి రెన్యువల్ చేసుకోవాలి. కావున ఇప్పుడు తెలంగాణ బ్యాంకుల్లో ఉన్న పంట రుణాలన్నీ చెల్లింపు కాల పరిమితిని దాటినవే. అవన్నీ బ్యాంకింగ్ భాషలో ఎన్ పీఏలు, నిరర్థక ఆస్తులు. వాటిలో ఎంత జమ కట్టినా లిమిట్ దాటి ఉన్న మొత్తాన్ని మాత్రమే తీసుకోవచ్చు. ఈ విధానాన్ని మార్చే అధికారం ఏ బ్యాంకు ఉద్యోగికీ లేదు. డిఫాల్ట్ గా ఉన్న దాన్ని పై అధికారి అనుమతితోనే స్పెషల్ కేసుగా మార్చవచ్చు. దానిని అవసరమైతే ఆడిటర్ కు చూపించాలి. ఎవరి ఒత్తిడితోనే బ్యాంకు ఉద్యోగి స్వయంగా మార్చితే క్రమశిక్షణా రాహిత్యం కింద శిక్షార్హుడవుతాడు. ఇదంతా తెలియక బ్యాంకు ఉద్యోగులే రైతులపై లేదా రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టి ఇలా చేస్తున్నారనే ప్రచారం జరిగింది.
అప్పుల గురించి పట్టించుకోని రైతులు
మాట ఇచ్చినందుకైనా రైతుల బ్యాంక్ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిందే. టీఆర్ఎస్ సర్కారు కడుతుందనే భరోసాతో ఒక్క రైతు కూడా అప్పుల మొకం చూడలేదు. చేసేదిలేక 2020-–21 బడ్జెట్లో రుణ మాఫీ కోసం రూ.1,198 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వాస్తవానికి రైతుకు లక్ష రూపాయల దాకా పంట రుణాలను మాఫీ చేయాలంటే రూ.23,738 కోట్లు అవసరం అవుతుంది. అంత స్తోమత లేక తొలి విడతగా రూ.25,000 లోపు ఉన్న అప్పులను పూర్తిగా చెల్లిస్తూ ఆ పై అప్పున్న వారి ఖాతాలో నాలుగు ఇన్స్టాల్ మెంట్లు కడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం రూ.25 వేలలోపు అప్పున్న 5.83 లక్షల మంది రైతుల రుణాలు మాత్రమే మాఫీ లబ్ధి పొందగా ఇంకా రాష్ట్రంలో 37.7 లక్షల మంది రైతులు రాష్ట్ర సర్కారు ఎప్పుడు మాఫీ పైసలు కడుతుందా? అని ఎదురుచూస్తూ బ్యాంకుల దృష్టిలో మొండి బకాయిదారులయ్యారు. బ్యాంకులు తలుచుకుంటే వీరిపై ఎలాంటి చట్టపరమైన చర్యలైనా తీసుకోవచ్చు. అంతే కాకుండా కుటుంబ పెద్ద డిఫాల్టర్ గా ఉన్నందు వల్ల మిగతా సభ్యులకూ బ్యాంక్ లోన్లు దొరికే అవకాశం ఉండదు. క్రెడిట్ స్కోర్ ఆధారంగా అప్పులు మంజూరు అవుతున్న ఈ రోజుల్లో అప్పు బకాయి వారికి పెద్ద అడ్డంగా నిలుస్తుంది.
మాఫీ చేయకపోవడమే అసలు సమస్య
బ్యాంక్ ఖాతాల్లో పంట రుణాలు ఎందుకు బకాయిలుగా మిగిలిపోయాయో ఒకసారి చూద్దాం. 2018లో ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనే తలంపు రాగానే సీఎం కేసీఆర్ ఓటుకు నోటు రీతిలో రైతుబంధు పథకాన్ని ముందుకు తెచ్చారు. 2018–-19 బడ్జెట్ లో ఈ పథకం కోసం రూ. 12,000 కోట్లు కేటాయించి అదే సంవత్సరం ఖరీఫ్ పంట ఖర్చుల కోసం రైతులకు ఎకరానికి రూ. 5,000 చొప్పున అందజేశారు. ఎన్నికల ముందు రైతులకు పంట రుణాల మాఫీని అమలు చేయడం కన్నా నేరుగా నగదు అందజేయడమే ఉత్తమమని ఆయన అనుకొన్నారు. క్రమంగా రైతుబంధును కొనసాగించి బ్యాంకు రుణాల మాఫీని మరిపింపజేయాలనే ఆలోచన అయనది. తీరా ఎన్నికలొచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ తమను గెలిపిస్తే రైతుల బ్యాంకు అప్పులను రూ.లక్షన్నర దాకా మాఫీ చేస్తామని ప్రకటించింది. బ్యాంకులో 3 ఎకరాల రైతుకు కూడా లక్ష రూపాయల దాకా అప్పు ఉంది. 2015లో రుణ మాఫీతో రెన్యువల్ అయ్యాక దాని వైపు చూసిన వాళ్లు తక్కువ. అంటే అసలు రూ.లక్ష కాస్తా వడ్డీతో రూ.లక్షన్నర అయినా కావచ్చు. ఈ లెక్కన రైతుకు రైతుబంధు కన్నా కాంగ్రెస్ ఇస్తానన్న రుణ మాఫీయే లాభం చేకూర్చేది. దీనితో టీఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పడింది. రైతుబంధుకు అదనంగా తాము లక్ష రూపాయల దాకా బ్యాంక్ అప్పును కూడా మాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇవ్వక తప్పలేదు. కానీ ఆ హామీని నిలుపుకోలేదు.
క్రిమినల్ కేసులు పెట్టేలా ఆర్బీఐ చూడాలె
రైతు పంట అప్పుపై ఏడాది కాలానికే 7% సాధారణ వడ్డీ పడుతుంది. ఆ తర్వాత కాలానికి 14% చక్ర వడ్డీ జమవుతుంది. ప్రభుత్వ అలసత్వం వల్ల అప్పు దొరకక రైతులు, వసూళ్లు ఆగిపోయి బ్యాంకర్లు పాట్లు పడుతున్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. రైతుల కిచ్చిన మాట ప్రకారం రూ.లక్ష రుణమాఫీ చేసి తీరుతామని హరీశ్ రావు ప్రకటించారు. ఎంత చేసినా ఇంకో రెండు విడతల కోసం మరో రెండేండ్లు ఆగక తప్పని పరిస్థితి. ఒక సందర్భంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎన్నికల్లో బ్యాంకు అప్పులు కడతామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోని వారిపై క్రిమినల్ కేసులు వేస్తానని అన్నది. ఆ పనేదో చేస్తే రైతుల రుణ విముక్తి అయినా అవుతుంది లేదా రాజకీయ పార్టీలకు భయమైనా ఉంటుంది.
- బి.నర్సన్,
పొలిటికల్ ఎనలిస్ట్