సర్కారు రుణ మాఫీ చేయక.. బ్యాంకులు లోన్లు ఇస్తలేవు

మరో వారం పది రోజుల్లో వానాకాలం సీజన్​మొదలవనుంది. అయినా ఇంతవరకు “రుణ ప్రణాళిక” రూపొందించలేదు. ఏటా ఆగస్టులో రుణ ప్రణాళిక ప్రకటిస్తున్నా అమలుపై కూడా స్పష్టమైన సమీక్ష జరగడం లేదు. 2022 జనవరి 27న రాష్ట్ర వ్యవసాయ శాఖ ముసాయిదా రుణ ప్రణాళిక ప్రకటిస్తూ 2022–-23 సంవత్సరానికి రూ. 67,863 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. 2021–22 సంవత్సరంలో పంటల రుణ ప్రణాళిక రూ.59,440 కోట్లగాను, దీర్ఘకాలిక రుణాల కింద రూ. 12,081 కోట్లుగా ప్రకటించింది. కానీ వాస్తవంగా రూ. 53,221 కోట్ల మేర పంట రుణాలు, రూ. 12,061 కోట్లు దీర్ఘకాలిక రుణాలే ఇచ్చారు.‘బుక్ అడ్జస్ట్​మెంట్ చేయడం’ ద్వారా మాత్రమే పంట రుణాలు ఇచ్చినట్లు ప్రకటించారు. 

మాఫీ ఇంకెన్నడు?

రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది రైతులుండగా అందులో 50 లక్షల మంది రైతులకే అకౌంట్లు ఉన్నట్లు బ్యాంకులు ప్రకటిస్తున్నాయి. ప్రతి బ్రాంచ్ సంవత్సరానికి 100 మంది కొత్త రైతులకు రుణాలు ఇవ్వాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. రాష్ట్రంలో 5,762 బ్యాంకు బ్రాంచీలున్నాయి. ఇందులో పట్టణ బ్యాంకు బ్రాంచీలు 727 తీసివేయగా 5 వేల గ్రామీణ, సెమీ గ్రామీణ బ్యాంకు బ్రాంచీలున్నాయి.100 మంది కొత్త రైతులకు రుణాలు ఇవ్వాలంటే రూ.5 లక్షల కోట్లు ఇవ్వొచ్చు. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. 2014 జూన్ 2న అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలోపు పంట రుణాలు(35 లక్షల మందికి రూ.16,124.38 కోట్లు)మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. 4 వార్షిక విడతలుగా మాఫీ చేయడంతో 2018 మార్చి వరకు మాఫీ ప్రక్రియ కొనసాగింది. అప్పుడు రైతులపై దాదాపు రూ.9,812 కోట్ల వడ్డీ భారం పడింది. తిరిగి 2018లో శాసన సభకు ఎన్నికలు జరిగి టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తూనే.. 11 డిసెంబర్​2018 నాటికి లక్షలోపు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. దాదాపు రూ.25,936 కోట్లు మాఫీ చేయాల్సి ఉండే. 2022 నాటికి 50 వేల లోపు రుణాలను రద్దు చేయడంతో రూ.6.5 లక్షల మంది రైతులు మాత్రమే రుణ విముక్తులయ్యారు. మిగిలిన36 లక్షల మంది రైతులు బ్యాంకులకు బాకీ పడి ఉన్నారు. దీంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం 2వ సారి కూడా 4 విడతలుగా మాఫీ ప్రకటించింది. 2023 మార్చి నాటికి బాకీలు పూర్తిచేయాలి. కానీ ఇంత వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో రైతుల రుణార్హత సందిగ్ధంలో పడింది.

ఆర్బీఐ ఆదేశాలు బేఖాతరు..

రాష్ట్రంలో 2020 డిసెంబర్ 31నాటికే బ్యాంకుల డిపాజిట్లు రూ. 5,47,010 కోట్లు ఉన్నాయి. రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం18 శాతం పంట రుణాలు అంటే రూ.98 వేల కోట్లు ఇయ్యాలె. కానీ రూ.35 వేల కోట్లకు మించి ఇవ్వడం లేదు. 2021 డిసెంబర్ నాటికి రూ. 6.03 లక్షల కోట్లు డిపాజిట్లు ఉండగా కేవలం రూ.68 వేల కోట్లు మాత్రమే పంట రుణాలుగా ప్రకటించారు. బ్యాంకులు రిజర్వుబ్యాంక్ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. మరో వైపు నాబార్డు కూడా రైతుల పక్షాన నిలువకుండా బ్యాంకర్లకు అనుకూలంగా ఉంటోంది. దేశ స్థాయిలో బ్యాంకర్ల వద్ద ప్రస్తుతం140 లక్షల కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. అందులో ఆర్బీఐ ఆదేశాల ప్రకారం 25 లక్షల కోట్ల మేరకు పంట రుణాలు ఇవ్వాలి. కానీ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2022–-23 సంవత్సరానికి రూ.16 లక్షల కోట్ల పంట రుణాలను ప్రకటించారు. 2021-–22లో రూ.12 లక్షల కోట్లు ప్రకటించి రూ. 9 లక్షల కోట్లు మాత్రమే రుణాలు ఇచ్చారు. 2022 వానాకాలం సీజన్​కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ బ్యాంకు రుణాలు ఇవ్వడానికి వీలుగా ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకోవాలి. కొత్త వారితో సహా రైతులందరికీ రుణాలు ఇప్పించాలి. స్కేల్​ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం సాగులో ఉన్న145 లక్షల ఎకరాలకు లోన్లు వచ్చేలా చూడాలి. జూన్15 నాటికల్లా రైతుల చేతికి రుణాలు వస్తే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, దున్నకాల ఖర్చులకు అనుకూలంగా ఉంటుంది. జూన్, జులై నెలల్లో రైతుల నుంచి పాత బాకీలు వసూలు చేయరాదనే రెవెన్యూ శాఖ నిబంధన ఉంది. అయినా కొన్ని బ్యాంకులు దాన్ని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు అందుతున్న ఆర్థిక సాయాన్ని, నిధులను పాత బాకీల కింద బ్యాంకులు పట్టుకోకూడదు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ ప్రత్యేక యంత్రాంగం రూపొందించి వానాకాలం సీజన్​కు రైతులకు రుణాలు అందేలా చూడాలి. 

వడ్డీల భారంతో ఆత్మహత్యలు..

గతంలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం రూ.11 వేల కోట్లు మాఫీ చేసినప్పుడు ప్రధాని వీపీ సింగ్ హయాంలో ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేసుకొని రైతులను ఒకేసారి రుణ విముక్తులను చేశారు. కేంద్రం పలు దఫాలుగా బ్యాంకులకు రుణం చెల్లించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం బాకీని తన ఖాతాలో వేసుకొని రైతులను రుణ విముక్తులను చేస్తేనే.. వాళ్లు బ్యాంకు అప్పులకు అర్హులవుతారు. బ్యాంకులు కొత్త లోన్లు ఇవ్వకపోవడంతో రైతులు బయట ప్రైవేట్ రుణాలు దాదాపు రూ.22 వేల కోట్ల వరకు అధిక వడ్డీలకు అప్పులు చేశారు. వడ్డీ భారం పెరిగి అప్పులు తీర్చలేక సంవత్సరానికి 640 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోకపోవడంతో ప్రాణాలు తీసుకుంటున్న వారిలో 40 శాతం కౌలుదారులే ఉంటున్నారు. ప్రస్తుతం బ్యాంకులకు రైతుల బకాయిలు రూ.32 వేల కోట్లు ఉన్నాయి. 17 లక్షల మంది కొత్త రైతులకు కూడా రుణాలు ఇవ్వడం లేదు. రిజర్వుబ్యాంకు ఆదేశాల ప్రకారం ప్రైవేటు రుణాలను సంస్థాగత రుణాలుగా మార్చాలని బ్యాంకులను ఆదేశించినప్పటికీ ఏ ఒక్క బ్యాంకు అందుకు సుముఖంగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ ఆదేశాలను అమలు చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాలు ‘లీడ్ బ్యాంక్’ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ అందులో కూడా ఈ సమస్యలేవి చర్చించడం లేదు. జిల్లా స్థాయిలో ప్రతి నెల జరుగుతున్న బ్యాంకర్ల సమావేశం కూడా రైతు రుణాలను పట్టించుకోవడం లేదు. 

- మూడ్​ శోభన్, 
రాష్ట్ర సహాయ కార్యదర్శి, 
తెలంగాణ రైతు సంఘం