
- రూల్స్ కఠినంగా మారడమే కారణం
న్యూఢిల్లీ: రూల్స్ కఠినంగా మారడంతో బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఇచ్చే లోన్లు నెమ్మదిస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. డొమెస్టిక్ మార్కెట్‌లో ఫండ్స్ సేకరించడం కఠినంగా మారిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ఇచ్చే లోన్లు రూ.19–20.5 లక్షల కోట్లకు తగ్గుతుందని పేర్కొంది. ఇది ఏడాది ప్రాతిపదికన 12 శాతం వృద్ధికి సమానం.
కానీ, కిందటి ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ అయిన క్రెడిట్ గ్రోత్ రూ.22.3 లక్షల కోట్లతో (16.3 శాతం వృద్ధి) పోలిస్తే తగ్గుతుందని అంచనా వేసింది. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ గ్రోత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16–18 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఇది 2023–24లో నమోదైన 25 శాతం గ్రోత్‌తో పోలిస్తే తక్కువ. కాగా, విచ్చలవిడిగా లోన్లు ఇస్తున్న కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటోంది.